హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున మేఘ్వాల్ వెల్లడించారు. సీనియర్ న్యాయవాదులైన లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటితోపాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుజనను అదనపు జడ్జ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌవది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల ఈ ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేయగా..తాజాగా కేంద్రం వీరి నియామకాన్ని నోటిఫై చేసింది. జిల్లా జడ్జీల క్యాడర్నుంచి ఒకరు, న్యాయవాదుల కోటానుంచి ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం లభించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ మరో ఇద్దరు తన సహచర సీనియర్ జడ్జిలను సంప్రదించిన అనంతరం నిరుడు అక్టోబర్ 23న ఈ ముగ్గురి పేర్లను సిఫారసు చేశారు. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన సుజన 2010లో జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు. ఏడాదిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన అలిశెట్టి లక్ష్మీనారాయణ 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసులు వాదించిన అనుభం ఉంది. లక్ష్మీనారాయణ, అనిల్ హైకోర్టు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.