World Tourism Day | ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ పాల్గొని అవార్డులు అందుకున్నారు. జనగామ జిల్లాలోని హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తి, సిద్దిపేట జిల్లా గొల్లబామ చీరల కేంద్రంతో పాటు రంగనాయక కొండ, ప్రకృతి రమణీయ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న చంద్లాపూర్ గ్రామాలు కేంద్ర అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో శైలజా రామయ్యార్ అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పర్యాటక రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.