కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/ లింగాలఘనపురం/పెద్దవంగర : అప్పుల బాధ భరించకలేక బుధవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు తీర్చకపోతే ఇంటిని వేలం వేస్తామని బ్యాంకు అధికారులు బెదిరించడంతో మనస్తాపం చెంది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు, సాగు కలిసి రాక అప్పులు భారంగా మారడంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున బలవన్మరణం చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం…కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సి ర్పూర్-టీ మండలం శివపూర్‌కు చెందిన కారెం సంతోష్ (33) ఏడేండ్ల క్రితం సిర్పూర్-టీలోని సహకార బ్యాంకులో రూ. 30 వేల రుణం తీసుకున్నాడు. ఈ రుణంలో కొంత చెల్లించినప్పటికీ ఇంకా బకాయిపడ్డాడు. మంగళవారం బ్యాంకు అధికారులు సంతోష్ ఇంటికి వచ్చి.. రుణం తీర్చాలని.. లేకుంటే ఇంటికి తాళం వేసి వేలం వేస్తామని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ బుధవారం సాయంత్రం పురుగు మందు తాగాడు. చుట్టు పక్కల వారు గమనించి సిర్పూర్(టీ)లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య కారెం జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిర్పూర్(టీ) ఎస్సై కమలాకర్ తెలిపారు.
లక్ష దాటిన అప్పు..
లక్షల్లో అప్పులు తీసుకొని.. తిరిగి కట్టని పెద్దల పట్ల మెతక వైఖరి అవలంబించే బ్యాంకు అధికారులు చిన్న, సన్నకారు రైతుల వద్ద మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కారెం సంతోష్ ఏడేండ్ల క్రితం రూ. 30 వేలు అప్పు తీసుకోగా.. వడ్డీ, చక్రవడ్డీలు వేయడంతో అది కాస్త రూ.లక్షకుపైగా చేరినట్టు తెలుస్తున్నది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే రైతు సంతోష్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణే కష్టంగా ఉండగా, అప్పు తీర్చడం తలకు మించిన భారంగా మారింది. అధికారులు వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
లింగాలఘనపురంలో..
జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన నక్కపెల్లి శంకర్ (42) తనకున్న రెండెకరాలను సాగు చేయడంతోపాటు ఎకరం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడులు లేకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. సాగుతోపాటు ఇంటి అవసరాల కోసం మొత్తం రూ.8 లక్షల వరకు అప్పు అయ్యింది. వీటిని తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన శంకర్ బుధవారం లింగాలఘనపురం – పటేలుగూడెం, నెల్లుట్ల గ్రామాల మధ్యన మిత్రుడి వ్యవసాయ బావి దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.
గంట్లకుంటలో రైతు శ్రీధర్..
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటకు చెందిన కన్నె శ్రీధర్(41) తనకున్న 2.20 ఎకరాల భూమితోపాటు మరో 7.20 ఎకరాలను కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అందులో మిర్చి, వరి, మక్కజొన్న సాగు చేశాడు. పంట సాగు కోసం రూ.7 లక్షల దాకా అప్పు చేశాడు. దిగుబడులు సరిగా రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఆందోళనకు గురయ్యాడు. తీవ్రంగా కుంగిపోయిన శ్రీధర్ నాలుగు రోజుల క్రితం తన వ్యవసాయ బావి వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్టు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు రాలేదని ఎస్సై కాంత్రికిరణ్ తెలిపారు.