వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ) : వరంగల్‌లోని ఎల్బీనగర్లో బుధవారం దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సోదరుల మధ్య వివా దం ముగ్గురి హత్యలకు దారితీసింది. ఎండీ చాంద్‌పాషా (50), అతని భార్య సాబీరా (42), బావమరిది ఎండీ ఖలీల్ (40) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్‌పాషా, షఫీ సోదరులు పాతికేళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నారు. రూ.కోటి లావాదేవీలకు సంబంధించి వీరిమధ్య వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో ఎండీ షఫీ, అతని అనుచరులు ఆరుగురితో కలిసి బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆటోలో ఎల్బీనగర్లోని చాంద్‌పాషా ఇంటికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న ఇనుప రంపంతో తలుపులను కోశారు. చాంద్‌పాషా, అతని భార్య సాబీరా, బావమరిది ఖలీల్‌పై కారంపొడి చల్లి కత్తులు, ఇనుప రంపం తో దాడిచేశారు. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అక్కడే ఉన్న చాంద్‌పాషా కూతురు రూబీనా (హీనా) చంపొద్దని బాబాయి షఫీని ప్రాధేయపడింది. హీనాను వదిలేసిన షఫీ మరో గదిలో పడుకున్న చాంద్‌పాషా కొడుకులు ఫహద్, సమద్‌పై కూడా దాడికి దిగారు. ఇద్ద రూ తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి బాధితులను దవాఖానకు తరలించారు.వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రైలు మిస్ అయి.. ప్రాణాలు కోల్పోయి
మృతుల్లో ఒకరైన ఖలీల్ది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం. మంగళవారం వరంగల్ వచ్చి ఇంటికి వెళ్తుండగా రైలు మిస్సయ్యింది. దీంతో సోదరి సాబీరా ఇంట్లో ఉన్నా డు. ఈ క్రమంలో షఫీ చేతుల్లో హత్యకు గురయ్యాడు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.