హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన విధానమే ఉత్తమమన్న భావనలో ఉన్నత విద్యామండలి ఉంది. కామన్ రిక్రూట్‌మెంట్‌బోర్డు ద్వారానే పోస్టులను భర్తీచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. స్క్రీనింగ్ టెస్ట్(రాత పరీక్ష) సైతం ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఈ విధానంలోనే పూర్తి పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా నియామకాలు చేపట్టవచ్చన్న అభిప్రాయంతో మండలి ఉంది. రాష్ట్రంలోని వర్సిటీ ఆచార్యుల పోస్టులను ఎలా భర్తీ చేయాలన్న అంశంపై ఉన్నత విద్యామండలి అధ్యయనం చేస్తుంది. అధ్యయానికి ఉన్నత విద్యామండలి నియమించిన త్రిసభ్య కమిటీ మంగళవారం తొలిసారిగా భేటీ అయ్యింది. త్రిసభ్య కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కుమార్, ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్కు అనుసరిస్తున్న పద్ధతులపై సమగ్రంగా చర్చించారు. పాత విధానం కన్నా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి, స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఉత్తమమన్న భావన సమావేశంలో వ్యక్తమైనట్టు తెలిసింది. అయితే ప్రాథమికంగా పలు అంశాలపై తాము చర్చించామే తప్ప ఎలాంటి నిర్ణయానికి రాలేదని త్రిసభ్య కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల వీసీల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తామని, ఇంకా రెండు మూడు సమావేశాల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించి నెల రోజుల్లో నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు.