హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రీకొడుకులు సహా మరొ వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దవూర మండలం ముత్యాలమ్మగూడెం వద్ద అర్ధరాత్రి చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతి చెందిన తండ్రీకొడుకులు ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పల్ మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తంసయ్య(60), ప్రకాష్ రావు(40)గా గుర్తించారు. మరోవ్యక్తి సాగర్ నుండి వస్తున్న కారులో ఉన్న సాయికుమార్(26) గా గుర్తించారు. ఇతను వరంగల్ ఎస్ఎల్బీసీ సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.