రఘునాథపల్లి, మే13 : ఓటేయడానికి వస్తూ రోడ్డు పక్కన టిఫిన్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు దూసుకు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన తెలుకలపల్లి రవీందర్ (35) తన భార్య జ్యోతి (32), కుమారుడు భావేష్ (10)తో కలిసి హైదరాబాద్ నుంచి సూటీపై వరంగల్‌కు వస్తున్నారు. మార్గమధ్యలోని రఘునాథపల్లిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి టిఫిన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న గరుడ బస్సు అతివేగంగా వచ్చి వారిపైకి దూసుకొచ్చింది. దీంతో జ్యోతి అక్కడికకడే మృతిచెందగా, రవీందర్, భావేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా దవాఖానలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. సోమయ్యకుంట తండాకు చెందిన టిఫిన్ సెంటర్ నిర్వాహకులు సంతోష్ కుమార్, శ్రీకాంత్, కొయ్యడ ప్రభాకర్‌కు గాయాలు కాగా హైదరాబాద్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేశ్ యాదవ్ తెలిపారు.