Obulapuram Mining | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఓబుళాపురం ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ దోషులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజల్ ఖాన్, రాజగోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు బుధవారం ఒకరోజే ముగ్గురు న్యాయమూర్తులు నిరాకరించారు.
తొలుత జస్టిస్ కే శరత్ విచారణ నుంచి వైదొలుగుతున్నట్ట ప్రకటించి, ఆ వ్యాజ్యాన్ని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజీస్ట్రీని ఆదేశించారు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ దగ్గరకు ఆ కేసు వచ్చింది. అనంతరం ఆయన కూడా ఆ కేసును మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించడంతో జస్టిస్ భీమపాక నగేశ్ వద్దకు చేరింది. కానీ, రాత్రి 7.30 గంటలు దాటిన తర్వాత జస్టిస్ నగేశ్ కూడా ఆ కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో విచారణ జూన్‌కు వాయిదా పడింది.