IAS | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ విషయంలో సర్కారు వింత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనాలోచిత సంప్రదాయాలను తెరపైకి తీసుకొస్తున్నదని అధికారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారుల వైఖరి వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. తాజాగా ప్రభుత్వం మూడు జిల్లాలకు డీఈవోలుగా ఐఏఎస్ అధికారులను నియమించడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో డీఈవోల పైస్థానంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ)లు ఉంటారు.
ఆపై స్థానంలో అడిషనల్ డైరెక్టర్లు ఉంటారు. డీఈవోలుగా ఐఏఎస్‌లను నియమించడంతో ఆర్జేడీలు, అడిషనల్ డైరెక్టర్ల కింద ఐఏఎస్‌లు పనిచేయాల్సి రావడం దారుణమని అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ కంటే కిందిస్థాయి క్యాడర్లో ఉన్న అధికారుల కింద ఐఏఎస్‌లు ఎలా పనిచేస్తారు? పైస్థాయి క్యాడర్లోని ఐఏఎస్‌లకు .. నాన్ ఐఏఎస్‌లు ఆదేశాలు ఎలా ఇస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమే అని చెప్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే ఉన్న విద్యాశాఖలో వరుసగా వింత నిర్ణయాలు పరిపాటిగా మారిపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
కుమ్రంబీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా, జనగాం అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్కు.. ఆయా జిల్లాల డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాల డీఈవో పోస్టులు కూడా ఖాళీ కాగా, ఆయా జిల్లాల్లోని ఇతరశాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. డీఈవోల అదనపు బాధ్యతల అప్పగింతలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయని విద్యావేత్తలు చెప్తున్నారు.
ఇందుకు పలు ఘటనలను ఉదహరిస్తున్నారు. ములుగు జిల్లా డీఈవోగా అదే జిల్లాలో పనిచేస్తున్న ఇంటర్ విద్యాశాఖ అధికారికి, రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోగా జెడ్పీ సీఈవోకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం జూలై 31న హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డీఈవోల సమావేశం నిర్వహించింది. కానీ ఈ కాన్ఫరెన్స్‌కు ఆ ఇద్దరు అధికారులు హాజరుకాలేదు. ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్‌లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులకు ఏదైనా సమాచారం కావాలంటే.. తమకంటే పైస్థాయి క్యాడర్‌కు చెందిన సదరు ఐఏఎస్‌లను అడగడంలేదు. డీఈవో కార్యాలయలోని అసిస్టెంట్ డైరెక్టర్లను సంప్రదించి, కావాల్సిన సమాచారం తీసుకుంటున్నారు.
విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ప్రతీరోజు డీఈవోలను సంప్రదిస్తారు. ఆన్లైన్ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రొఫార్మాలు పంపించి నివేదికలు కోరుతారు. పదోన్నతుల ప్రక్రియ నడుస్తున్నందున ఖాళీలు, సీనియారిటీ జాబితాల తయారీ, మార్పులు, చేర్పులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. డీఈవోల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఉంది. ఈ గ్రూపులో ఏదో ఒక సమాచారాన్ని చేరవేస్తుంటారు. ఈ తరుణంలో ఐఏఎస్ అధికారులు డీఈవోలుగా ఉన్న జిల్లాల నుంచి పాఠశాల డైరెక్టరేట్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ అధికారులు సమాచారం ఎలా అడగలరన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయా జిల్లాల నుంచి సమాచారం తెప్పించేందుకు డైరెక్టరేట్ అధికారులు కూఆ ప్రోటోకాల్ విషయంలో భయపడుతున్నారని తెలుస్తున్నది.
డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడం.. ఐఏఎస్ అధికారుల విలువను తగ్గిస్తుందని టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. ఈ మేరకు శనివారం సీఎస్ రామకృష్ణారావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది సర్వీస్ రూల్స్‌కు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. విద్యాశాఖతో సంబంధమున్నవారికి డీఈవో బాధ్యతలను అప్పగించడం సుముచితమని సూచించారు.