కమలాపూర్, సెప్టెంబర్ 25: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సుమారు మూడు గంటలు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా రు. బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.40 గంటల వరకు కరెంటు లేకపోవడంతో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, బ్యాంకుల్లో సేవలు నిలిచిపోవడంతో ప్రజలు, ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు.
తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన లబ్ధిదారులు నిరీక్షించాల్సి వచ్చింది. గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపివేస్తుండటంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పనులు కాక తిరిగి ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయమై కమలాపూర్ ట్రాన్స్కో ఏఈని వివరణ కోరగా బస్టాండ్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ ఏ-బీ స్విచ్ చెడిపోయినందున విద్యుత్తు సరఫరా నిలిపివేసినట్టు తెలిపారు.