TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. గురువారం సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించిందని ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాల నుంచి పశ్చిమ-మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, పలు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ముషిరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్‌లో 15.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.