హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మద్య కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.3,151 కోట్లు వెంటనే చెల్లించాలని, లేకుంటే రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, సరఫరాను నిలిపివేస్తామని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశాయి. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో తెలంగాణ ఆలోబెవ్ పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయని ఆయా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారులను కలిసి ఎన్నిసార్లు అభ్యర్థించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదని పేర్కొన్నారు. ఇలాగైతే తాము పరిశ్రమలను నడిపించలేమని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని స్పష్టంచేశారు. రాష్ట్ర ఖజానాకు స్థిరమైన ఆర్థిక వాటాను అందిస్తున్న మద్యం కంపెనీలు అస్థిర వ్యాపారంతో సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ మేరకు మూడు ఆలోబెవ్ పరిశ్రమ సంఘాలు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆలహాలిక్ బేవరేజెస్ కంపెనీస్ (సీఐఏబీసీ), బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఐఏ), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ) ప్రభుత్వానికి లేఖలు రాశాయి.