బంజారాహిల్స్. ఏప్రిల్ 4: ఇవ్వాల్సిన డబ్బుకు వడ్డీ సహా రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి తమను బ్లాక్మెయిల్తోపాటు ఇంటివద్దకు రౌడీలతో వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఏఎస్ నవాబ్ సజ్జాద్ అలీఖాన్ కుటుంబానికి ఎర్రమంజిల్‌లోని మెహర్మంజిల్ సమీపంలో 3 వేల గజాల స్థలం ఉన్నది. దానిని కొనేందుకు గచ్చిబౌలికి చెందిన మహ్మద్ అలీ హిమ్మతి అనే వ్యాపారి ముందుకొచ్చాడు. రూ.6 కోట్ల కు బేరం కుదరగా 2022 మార్చిలో రూ.2.30 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించిన హిమ్మతీ మిగతా సొమ్మును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది.
తాను చెల్లించిన రూ.2.30 కోట్లకు, వడ్డీతో కలిపి మొత్తం రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల నవాబ్ సజ్జాద్ అలీఖాన్ వద్దకు వచ్చి మహ్మద్ అలీ హిమ్మతీ డిమాండ్ చేశాడు. ఇదే విషయంపై ఇద్దరి నడుమ వివాదాలు కొనసాగుతున్నాయి. కొంతకాలంగా సజ్జాద్ ఖాన్ ఇంటికి రౌడీలను పంపించడం, ధూల్‌పేటకు చెందిన కొందరు మహిళలను రప్పించి న్యూసెన్స్‌కు పాల్పడ్డాడని బాధిత కుటుంబం తెలిపింది. తమకు డబ్బు ఇవ్వకపోతే కుటుంబసభ్యులను కిడ్నాప్ చేస్తామని, ఇద్దరు పిల్లలను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వాటిని భరించలేక కొన్ని చెక్కులు ఇచ్చామని తెలిపారు. గత నెల 30న ఇంట్లోకి వచ్చి బెదిరించడంతోపాటు చంపేందుకు ప్రయత్నించారని, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హిమ్మతీపై ఐపీసీ 384, 354, 509, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.