కోల్‌సిటీ (రామగుండం) : రామగుండం నగర పాలక సంస్థ మేయర్ బంగి అనిల్‌కుమార్(Mayor Anil Kumar)కు బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి శనివారం రాత్రి లేఖ రాగా మేయర్ ఆ లేఖను పోలీసులకు అప్పగించారు. బెదిరింపు లేఖ(Threatening letter) విషయంలో పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారని మేయర్ తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారని వివరించారు.
మేయర్‌కు బెదిరింపు లేఖను పంపడాన్ని కార్పొరేటర్ల ఫోరం అధ్యక్షుడు కన్నూరి సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ధాతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం బల్దియా కార్యాలయంలో మేయర్‌తో అత్యవసర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెదిరింపు లేఖను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తామంతా మేయర్‌కు అండగా ఉంటామని ఫోరం నాయకులు స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తులే తమ స్వలాభం కోసం బెదిరింపు లేఖను పంపించి ఉంటారని , త్వరలోనే నిందితులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) దృష్టికి కూడా తీసుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో ఫోరం నాయకులు ఐత శివకుమార్, వేగోళపు శ్రీనివాస్, సలీం బేగ్, సాగంటి శంకర్, బాల రాజ్‌కుమార్, పొన్నం లక్ష్మణ్, గణేశ్ ఉన్నారు.