ఖమ్మం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో ఆదివారం సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది. పెండ్లి కుమారుడిగా శ్రీరామచంద్రుడు, పెండ్లికుమార్తెగా సీతమ్మ తల్లి ఆశీనులైన మిథిలా నగరం (స్టేడియం) వైకుంఠాన్ని తలపించింది.
సీతమ్మకు కల్యాణం రోజున దేశంలో ఎక్కడైనా రెండు మంగళసూత్రాలు మాత్రమే ధరింపచేస్తారు. కానీ, భద్రాచలంలో మాత్రం మూడు మంగళసూత్రాలు ఉంటాయి. ఒకటి జనకమహారాజు చేయించినది కాగా, రెండోది దశరథమహారాజు చేయించినది. ఇక మూడో ది భక్తరామదాసు సీతమ్మను తన కూతురుగా భావించి చేయించినది.
శ్రీరామచంద్రుడు, సీతమ్మకి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కానీ, వారికి సరిపడా వసతులు, స్నానఘట్టాలు ఏర్పాటుచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.