హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ‘ఇందిరమ్మ రాజ్యమంటే జర్నలిస్టులపై నిర్బంధమా? ప్రజాపాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేదా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓయూలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్లను అక్రమంగా అరెస్ట్ చేయటం దారుణమని, జర్నలిస్టులపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ‘జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసనను చూపిస్తే తప్పా?’ అని బుధవారం విడుదల చేసిన ప్రకనటలో సర్కారును కేటీఆర్ ప్రశ్నించారు.
మంగళవారం బలంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన, బుధవారం ఓయూలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఇందిరమ్మ రాజ్యమంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా? అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియా లో మళ్లీ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయ ని, పోలీసుల బూట్ల చప్పు ళ్లు, ముళ్లకంచెలు చూస్తుం టే విద్యార్థులు మరో ఉద్యమంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం ఖాయమని పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టు, కెమెరామెన్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్ట్ యూనియన్లు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు.