Y.V. Subba Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఏపీలోని అధికార వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ఇప్పటికీ శాశ్వత రాజధాని లేనందున హైదరాబాద్‌ను మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో పదేండ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం పదేండ్ల వరకు హైదరాబాద్‌ను ఉమ్మ డి రాజధానిగా కొనసాగించాలి. ఈ సమయంలో వైబీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా, వివాదాస్పదంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ను మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉంచాలి. ఎన్నికల తర్వాత సీఎం జగన్, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. రాజధాని కట్టే అవకాశం ఉన్నా ఐదేండ్లు తాత్కాలిక రాజధాని పేరుతో టీడీపీ కాలయాపన చేసింది. విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తాం. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తాం. రాజధాని నిర్మించే ఆర్థిక వనరులు లేక విశాఖను రాజధానిగా ఏర్పాటుచేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యేవరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలనేది మా ఆలోచన’ అని పేర్కొన్నారు.
వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వైసీపీ పార్టీ అభిప్రాయం కాదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఇంకొన్నేండ్లు కొనసాగించాలన్న ప్రతిపాదన మంచిదేనని అభిప్రాయపడ్డారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించడం సరికాదని తెలిపారు. ఐదేండ్లు కండ్లు మూసుకుని ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పెంచాలనడం ప్రజలను మోసం చేయడమేనని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అమరావతిని నాశనం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి ప్రతిపాదన సరికాదని తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే ఎవరి పరిపాలన వారు సాగిస్తున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ జోలికి వస్తే ఊరుకోబోమని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసమే వైసీపీ ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు తెరమీదకి తెస్తున్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లబ్ధి కోసమే సెంటిమెంట్ రాజేస్తున్నారని ఆరోపించారు. పదేండ్లలో ఏపీలో రాజధాని ఏర్పాటు చేసుకోవడంలో అకడి రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
ఏపీలో ఇప్పటికే మూడు రాజధానుల చుట్టూ రాజకీయం తిరుగుతుండగా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పుడు తిరుపతిని రాజధాని చేయాలని ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. 1953 లోనే తిరుపతి ఏపీ రాజధాని కావాల్సి ఉన్నదని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం తిరుపతిని రాజధాని చేస్తుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. రాజధాని అయ్యేందుకు తిరుపతికి అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని సమస్యలను పరిష్కరించేదాకా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని రాయలసీమ రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వాదనను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తిరస్కరించారు. వైసీపీ నేతల డిమాండ్ హాస్యాస్పదంగా ఉన్నదని కొట్టిపారేశారు. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుంచి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే అందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరోరని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనే తాము కోరుకుంటున్నామని, ఏపీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి.. కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దు అని సూచించారు.