హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పాఠశాలల తరగతులు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు ఇవ్వనేలేదు.. కొన్నిచోట్ల టీచర్లే లేరు.. మరికొన్నిచోట్ల బుక్కులు లేవు.. యూనిఫాం అందనూలేదు.. ఫలితంగా గురుకులాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో కాంగ్రెస్ మరో హామీ అటకెక్కింది. విద్యాసంవత్సరం ఆరంభం నాటికే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తామన్న హామీ అమలుకు నోచలేదు. సర్కారు నిర్లక్ష్యంతో ఏడాదిన్నర కాలంలో గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఎస్సీ గురుకుల విద్యార్థులకు నిరుటితోపాటు ఈ ఏడాది యూనిఫాం కూడా అందించలేదు.
ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలే రాలేదు. డైట్ టెండర్ల ప్రక్రియ ప్రారంభమే కాలేదు. గురుకులంలో చేరిన విద్యార్థులకు ఏటా సాధారణ, తెల్లది కలిపి మొత్తంగా 3 జతల యూనిఫాం ఇస్తారు. వీటితోపాటు క్రీడల డ్రెస్ కూడా ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఎస్సీ గురుకులంలో నిరుడు యూనిఫాంనే ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకరూప దుస్తుల జాడే లేదు. గతంలో ఏకరూప దుస్తులను కుట్టించినవే ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. ఏకరూప దుస్తులను ప్రభుత్వమే కుట్టించి ఇస్తుందని తెలిపింది. సొసైటీ ద్వారా క్లాత్‌ను కొనుగోలు చేసినా, ఎవరితో కుట్టించాలి? ఎంత రేటు చెల్లించాలి? అనే విషయాలను ఇప్పటికీ ఖరారు చేయలేదు. దీంతో యూనిఫాం కుట్టుపనినే ప్రారంభించలేదు.
దుస్తులతోపాటు విద్యార్థులకు బూట్లు, పెన్సిల్, రబ్బర్ తదితర స్టేషనరిని ఇవ్వాల్సి ఉండగా, ఏడాదికాలంగా వాటిని కూడా ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏటా 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ప్లేట్, గ్లాస్‌ను అందించాల్సి ఉండగా నిరుడు ఇవ్వనేలేదు. ఈ ఏడాది ఇప్పటివరకూ అందివ్వలేదు. జూన్ 2న ఇంటర్ గురుకుల కళాశాలలను తెరచినా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయలేదు.
గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన కిరాణ సామగ్రి, కూరగాయాలు, చికెన్, మటన్, ఎగ్స్ తదితర వాటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా వారీగానే టెండర్లను నిర్వహించడం పరిపాటి. కానీ ప్రభుత్వం అందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఎక్కడా ఇప్పటివరకు చేపట్టలేదు. ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియడమే లేదు. దీంతో ప్రభుత్వం పాత రేట్ల ప్రకారమే, పాత కాంట్రాక్టర్లతోనే ప్రస్తుతం విద్యార్థులకు మెనూను అందిస్తున్నది.
ఎస్సీ గురుకులాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకున్న బోధన సిబ్బంది సర్వీస్‌ను ఈ ఏడాది రెన్యువల్ చేయనేలేదు. అంతేకాదు జీవో 1274 అమలు పేరిట ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న దాదాపు 2వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బందిని ఎస్సీ గురుకుల సొసైటీ తొలగించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో (సీవోఈ)ల్లో సబ్జెక్ట్ అసోసియేట్లనూ తొలగించింది. నెలరోజులు గడచినా సీవోఈల్లో కొత్త సబ్జెక్టు అసోసియేట్లను నియమించలేదు. పాతవారికి సైతం డెమోలను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైనా ఆ ప్రక్రియను ఇప్పటికీ పూర్తిచేయలేదు. దీంతో నెలరోజులుగా సీవోఈల్లో పాఠాలు బోధించేవారే లేకుండాపోయారు. కరీంనగర్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్లోనూ ఇదే పరిస్థితే. కొత్త కోర్సులకు అనుగుణంగా పాఠాల బోధనే ప్రారంభం కాలేదు. చాలా చోట్ల టీజీటీ, పీజీటీ, జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గురుకులాలకు మెయింటనెన్స్ చార్జీలను సైతం చెల్లించని పరిస్థితి నెలకొన్నది. సాధారణంగా జనరల్ గురుకుల కాలేజీకి నెలకు రూ.25 వేలు, సీవోఈ కాలేజీలకు నెలకు రూ.40 వేలను మెయింటనెన్స్ కోసం చెల్లిస్తుంటారు. మౌలిక వసతుల కల్పన, మరమ్మతులు తదితర వాటికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం కూడా ప్రత్యేక నిధులను చెల్లించాల్సి ఉన్నది. కానీ గత ఏప్రిల్ నుంచి ఆ చార్జీలను చెల్లించని దుస్థితి గురుకులాల్లో నెలకొన్నది.