Property Tax | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తుల నుంచి వాటి కొలతల ప్రకారం పూర్తి పన్ను వసూలుకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు తమ ఆస్తులను సెల్ఫ్ అసెస్మెంట్ (స్వీయ మదింపు) చేసుకొని పన్ను చెల్లిస్తున్న ఇండ్ల యజమానులు ఇకపై జీహెచ్ఎంసీ నిర్ణయించే మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం నగరంలో జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సర్వే చేపట్టినట్టు తెలుస్తున్నది. ఇది కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ మహానగరవాసులు అదనంగా మరో రూ.3000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఆస్తి పన్ను పెంపుదల ఉండదని హైదరాబాద్‌ను దేశంలో రోల్‌మాడల్‌గా నిలిపేందుకే ఈ సర్వే జరుపుతున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ, దాని మర్మం ఆస్తి పన్నుల వసూళ్లను పెంచడమేనని సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా ఆస్తి పన్ను వసూళ్లు ఏడాదికి రూ.1900 కోట్ల వరకు ఉండగా… దానిని రూ.5వేల కోట్లకు చేర్చాలనేది ఈ జీఐఎస్ సర్వే ప్రధాన లక్ష్యం. వాస్తవానికి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ సర్వే ప్రతిపాదన ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కానీ పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని భావించిన కేసీఆర్ సర్వే ప్రతిపాదనను తిరస్కరించారు. అదే ప్రతిపాదన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ మొగ్గ తొడిగింది. అణువణువూ అన్వేషించి… పన్నుల మోతను మోగించేందుకు సిద్ధమవుతున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 19 లక్షలకు పైగా ఉన్న ఆస్తుల నుంచి ఏటా రూ.1900 కోట్ల వరకు ఆస్తి పన్ను రూపంలో జీహెచ్ఎంసీ ఖజానాకు చేరుతున్నది. ఎన్నో ఏండ్ల కిందట నిర్ధారించిన ఆస్తి పన్నును ప్రామాణికంగా చేసుకొని యజమానులు చెల్లింపులు జరుపుతున్నారు. అనుమతులు లేని నిర్మాణదారులు రెట్టింపు స్థాయిలో ఆస్తి పన్ను కడుతున్నారు. వీరంతా స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) విధానంలోనే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. వీరు తమ ఆస్తిని భారీగా కాకున్నా… కొంతమేర తక్కువగా అంచనా వేసి చెల్లింపులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. వీరిలో పేద, మధ్య తరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జీఐఎస్ సర్వే ద్వారా ప్రతి ఆస్తిని అణువణువూ లెక్కించవచ్చని ఒక ప్రైవేటు ఏజెన్సీ ప్రతిపాదించినట్టు తెలిసింది. జీఐఎస్ సర్వేలో డ్రోన్ ద్వారా ప్రతి ఆస్తి కొలత పక్కాగా తేలుతుంది. గూగుల్ స్ట్రీట్ మ్యాప్ ద్వారా అది ఎన్ని అంతస్థుల భవనమో నిర్ధారణ అవుతుంది. ఇలా ప్రతి అంగుళం కూడా లెక్కించి… అది నివాస ప్రాంతమా? లేక వాణిజ్య ప్రాంతమా? అనే ప్రామాణికతతో ఆస్తి పన్నును సవరించనున్నారు. అంటే ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఇకపై భారీ మొత్తమే చెల్లించాల్సి వస్తుంది. తద్వారా జీహెచ్ఎంసీకి కాసుల వర్షం కురుస్తుందనేది సదరు ఏజెన్సీ వాదన.
జీఐఎస్ సర్వే ప్రతిపాదనను గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రైవేటు ఏజెన్సీ తెరపైకి తెచ్చింది. దీని ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం భారీగా పెరుగుతున్నది వాస్తవమే. కానీ ఆ పెరుగుదల పేద, మధ్యతరగతి భారాన్ని మోపుతుంది. ప్రస్తుతం ఆస్తుల మదింపు అణువణువూ కొలతల ఆధారంగా జరగలేదు. కాస్త అటుఇటూ ఉంటుందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు జీఐఎస్ సర్వే చేపట్టడమంటే చెల్లింపుదారుల నుంచి ముక్కుపిండి వాస్తవ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇండ్లకు సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపుదారుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉన్నాయి. వాణిజ్య సముదాయాలను మినహాయిస్తే కాలనీల్లో ఉండే చిన్నచిన్న వ్యాపారదారులు కూడా మధ్య తరగతి కుటుంబాల పరిధిలోకే వస్తారు. నిర్మాణాల వాస్తవ కొలతల ఆధారంగా పేద, మధ్య తరగతి ప్రజల నుంచి ముక్కుపిండి ఆస్తి పన్ను వసూలు చేయాల్సి రావడాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. వారి జేబుల నుంచి వచ్చే సొమ్ముతో జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యాన్ని కేసీఆర్ తిరస్కరించారు. దీంతో ఆ ప్రతిపాదన అప్పట్లో అటకెక్కింది.
మరోవైపు ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా జరుగుతున్న ఈ సర్వేలో.. యజమానుల నుంచి ఆధార్ కార్డు, ఇంటి డాక్యుమెంట్లు అన్నీ సేకరిస్తున్నారు. దీనిపై నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ దగ్గర యజమానులకు సంబంధించిన సమగ్ర వివరాలు కంప్యూటరీకరించి ఉన్నందున ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరమేముందని వారు ప్రశ్నిస్తున్నారు. అసలే సైబర్ క్రైం నిత్యం ఓ పెను సవాల్‌గా మారిన ఇలాంటి తరుణంలో ప్రజల వ్యక్తిగత డాటా బయటికి పోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రైవేటు ఏజెన్సీలకు వ్యక్తిగత వివరాలు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీఐఎస్ సర్వే దరిమిలా ప్రైవేటు ఏజెన్సీ డాక్యుమెంట్లను తీసుకోవడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఐఎస్ సర్వే మళ్లీ తెరపైకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సర్వే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతమున్న ఆదాయానికి అదనంగా మరో రూ.3వేల కోట్లు వస్తాయనే లక్ష్యంతో ఈ సర్వేకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తున్నది. కానీ పైకి అధికారులు మాత్రం… గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరిచేందుకు జీఐఎస్ సర్వే ఎంతగానో దోహద పడుతుందని చెప్తున్నారు. కానీ సర్వే అనంతరం యజమానులకు సాంకేతికంగా కొలతలు చూపి.. గతంలో తక్కువ పరిమాణం ప్రాతిపదికన తక్కువ మొత్తం చెల్లిస్తున్నారని, వాస్తవ కొలతల ఆధారంగా ఇంత మొత్తం నిర్ధారణ అయిందని నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. సాంకేతిక సర్వే అయినందున యజమానులకు దానిని తప్పుబట్టే అవకాశం కూడా ఉండదు.