(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అతిథులకు శాలువా కప్పడం ఒక సంప్రదాయం.. దాన్ని కప్పుకోవటం గౌరవం.. శాలువల్లోనూ కశ్మీర్ పశ్మీనా అంటే హుందాతనం. ప్రధాని మోదీ సైతం విదేశీ పర్యటనలకు వెళ్తే ఈ శాలువానే ధరిస్తారు. కానీ, ఇప్పుడు ఆ శాలువా, దాన్ని నేసే కళాకారుల జీవితాలు అంపశయ్య మీదికి చేరుకొన్నాయి. ఇప్పటికే, జీఎస్టీ పేరిట ఎడాపెడా పన్నులు మోపి, రాయితీలు ఎత్తేయడంతో బళ్లారి జీన్స్, చెన్నపట్నం బొమ్మలు, సోలాపూర్ చెద్దర్లు, మంగళూరు టైల్స్ ఇలా రెండు డజన్లకు పైగా దేశీయ పరిశ్రమలు కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. కశ్మీర్ పశ్మీనా తయారీ కర్మాగారాలు కూడా వచ్చే మూడు నెలల్లో కనిపించకపోవచ్చని అక్కడి కార్మికులు వాపోతున్నారు. పెరిగిన ఉత్పాదక ఖర్చు, డిమాండ్ లేకపోవడం, అత్తెసరు వేతనాలే దీనికి కారణంగా చెప్తున్నారు. తాము ఈ సంప్రదాయ వృత్తిని వదిలిపెట్టి కూలీ పనులకు వెళ్తే పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల కోసం కష్టాలు
పశ్మీనా శాలువా (కనీ శాలువా) ఎంతో ప్రసిద్ధమైంది. మేలు రకమైన కశ్మీర్ గొర్రెల నుంచి సేకరించిన ఉన్నితో ఈ శాలువాలను చేతి మగ్గం మీద ప్రత్యేకమైన డిజైన్లతో తయారు చేస్తారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో శాలువాకు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. ఒక్క శాలువాను తయారు చేయడానికి ఇద్దరు కార్మికులకు సుమారు మూడు నెలల పాటు కష్టపడాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల క్రితం.. ఒక్కో శాలువ తయారీకి తమకు రూ.60 వేలు వేతనంగా వచ్చేదని, ఇప్పుడు రూ.25 వేలు కూడా ఇవ్వట్లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారిన ద్రవ్యోల్భణం, పరిస్థితులను బట్టి వేతనాలు పెరగాల్సింది పోయి.. మరింత తగ్గాయని, ఇదేమని అడిగితే తమ యజమానులు శాలువాలకు డిమాండ్ ముందులా లేదంటూ బుకాయిస్తున్నట్టు వాపోయారు. కళాకారులను ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
మోదీ ధరిస్తారు.. కానీ, జీతమే..
ప్రధాని మోదీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ మా శాలువాలను ప్రత్యేకంగా ధరిస్తారు. ఒక్క శాలువా తయారు చేయాలంటే, ఇద్దరు కార్మికులు పగలూ రాత్రి తేడా లేకుండా కష్టపడాలి. ఏకబిగిన ఇలా పనిచేస్తే రూ.40 వేల జీతం కూడా ఇవ్వరు. అంటే ఒక్కొక్కరికి, నెలకు రూ.7 వేల వేతనం కూడా రావట్లేదు.
-జహూర్ అహ్మద్, పశ్మీనా కళాకారుడు