Congress Govt | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి అప్పులతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ సర్కారు.. మరో రూ.2000 కోట్ల రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ నెల 16న మరో రూ.2000 కోట్ల అప్పు సమీకరించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 12 ఏండ్లకాలానికి, మరో వెయ్యి కోట్ల విలువైన బ్లాండ్లను 16 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐకి జారీచేసింది.
ఈ బాండ్లను ఈ నెల 16న ఆర్బీఐ వేలం వేయనున్నది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల అప్పు చేసింది. మంగళవారంనాడు వచ్చే అప్పుతో అది రూ.32 వేల కోట్లకు చేరనున్నది. 20 రోజుల క్రితమే బ్యాంకుల నుంచి రూ.2000 కోట్ల రుణం తీసుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన 222 రోజుల్లో రోజుకు రూ.144 కోట్ల చొప్పున రుణాలు సేకరించింది.
ఇన్ని అప్పులు చేసినా సరే.. ఆస్తుల కల్పన ఏమైనా జరిగిందా? అంటే అదీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్.. ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంపై రేవంత్రెడ్డి సరారు శ్రద్ధపెట్టడం లేదని ఆర్థికరంగ నిపుణులు, రాజకీయవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అప్పులతో ఒక భారీ ప్రాజెక్టు కానీ, ప్రజల జీవితాలను మార్చే ఒక భారీ పథకంగానీ చేపట్టిన దాఖలాలు లేవని పెదవి విరిస్తున్నారు.
రుణమాఫీ కోసం అప్పులు
అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటి అమలుకు ఆపసోపాలు పడుతున్నది. తెలంగాణ ప్రజలపై మరింత రుణభారాన్ని మోపుతున్నది. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలుకు భారీగా రుణాలను సమీకరిస్తున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు.. ఇందుకోసం సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది.
వానకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమై నెల గడిచింది. సెప్టెంబర్ వరకు ముగిసే ఈ సీజన్లో రైతు భరోసా (గతంలో రైతుబంధు) పథకం కింద ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాల్సి ఉన్నది. ఈ పథకానికి కనీసం రూ.5 వేల కోట్లయినా తక్షణం అవసరమని అంచనా. 18 నుంచి 59 ఏండ్లలోపు రైతులకు జీవిత బీమా పథకం కిందరూ.1500 కోట్ల ప్రీమియాన్ని ఎల్ఐసీ సంస్థకు పంద్రాగస్టులోగా సర్కారు చెల్లించాల్సి ఉన్నది.
బాండ్ల ద్వారా రూ.15 వేల కోట్లకుపైగా
ప్రతి నెలా రూ.5 వేల కోట్ల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది. జూలై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ భూములతోపాటు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లకుపైగా రుణాలను సేకరించేందుకు ఉన్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
బాండ్ల విక్రయం, భూముల తనఖా, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా రుణాలు తీసుకోవడంపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటుచేసి రుణాలు సేకరిస్తున్నదంటూ ప్రతిపక్షంలో ఉండగా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు అందినకాడల్లా తీసుకొస్తున్న రుణాలను మౌలిక వసతుల కల్పనకు, ఆస్తుల సృష్టికి వినియోగిస్తారా? లేదా ఇతర పథకాలకు మళ్లిస్తారా? అని రాజకీయవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.