KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. గురువారం ఉదయం 10.40 నుంచి సాయంత్రం 5.30 దాకా కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన విచారణలో పలు అంశాలకు కేటీఆర్ వివరంగా సమాధానం ఇచ్చారు.
ఈడి అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎన్నిసార్లు విచారణకు రమ్మన్న వస్తానని… మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానని తెలిపారు. భారత రాజ్యాంగం పైన, దేశ న్యాయవ్యవస్థ పైన తనకు అపారమైన గౌరవం ఉన్నదని కేటీఆర్ తెలియజేశారు. ఈరోజు ఈడీకి రెండు డాక్యుమెంట్లను(ఫార్ములా-ఈ పైన నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ -2020) ఇచ్చి కేటీఆర్ రిసిప్ట్ తీసుకున్నారు.
ఫార్ములా ఈ రేసు అనంతరం స్వతంత్ర సంస్థ నీల్సన్ రూపొందించిన నివేదికను ఈడీ అధికారులకు కేటీఆర్ అందజేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 82 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక లబ్ది జరిగిందని నీల్సన్ సంస్థ తెలిపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. దీంతోపాటు అప్పటి ప్రభుత్వం 2020 అక్టోబర్ నెలలో ప్రకటించిన తెలంగాణ ఎలక్ట్రిక్ పాలసీ కాపీని కూడా కేటీఆర్ విచారణ అధికారులకు అందజేశారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులతోపాటు మొబిలిటీ రంగంలో తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దే ఒక గ్రాండ్ విజన్, ఎజెండాతో పెట్టిన తెలంగాణ ఈవీ పాలసీ అని కేటీఆర్ సవివరంగా తెలిపారు.
ఈవీ పాలసీ స్ఫూర్తిలో భాగంగానే తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల పైన ఒక దీర్ఘకాల ఎజెండాతో ఈ రేసును నిర్వహించినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ రేసు వలన రాష్ట్రంతో పాటు దేశానికి కూడా లాభం జరిగిందని, తద్వారా దేశ ప్రతిష్ట పెరిగిందని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రులు కూడా ఈ రేసులో పాల్గొన్నట్లు తెలిపారు కేటీఆర్.
ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సాంకేతిక అంశాలే మినహా.. ఎక్కడ పైసా అవినీతి కానీ, మళ్లింపు కానీ జరగలేదు. ప్రభుత్వం సొమ్ములు ఇక్కడి నుంచి ఫార్ములా-ఈ సంస్థకు చేరిన రికార్డులని స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన పూర్తి డబ్బులు సంస్థ వద్ద ఉన్నప్పుడు ఇందులో అవినీతి లేనేలేదని కేటీఆర్ ప్రస్తావించారు. ఈడీ విచారణ సందర్భంగా మరికొన్ని వివరాలు అధికారులు అడిగారు. కేటీఆర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు అడిగారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ అందిస్తానని విచారణ అధికారులకు కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా..? సీఎంకు కేటీఆర్ సవాల్
Road Accident | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. యాదాద్రి జిల్లా వాసులు నలుగురు మృతి