హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావుపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మండిపడ్డారు. శనివారం బీఆర్ఎస్ ఎన్ఆర్ఐల జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేటీఆర్, హరీశ్‌పై నిరాధార ఆరోపణలను ముక్తకంఠంతో ఖండించారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో పెట్టని రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలుచేసి కేసీఆర్ కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు.
ప్రజాసమస్యలను విస్మరించి స్కామ్‌లకు తెరలేపి ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుంటున్నదని నిప్పులు చెరిగారు. నాడు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలను సమూలంగా మార్చిన కేసీఆర్‌ను నిత్యం బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ ముసుగులో రాజకీయ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ఎన్ఆర్ఐలు అండగా ఉంటారని స్పష్టంచేశారు.