RS Praveen Kumar | కరీంనగర్ కదన కుతూహలం మే 13 వరకు కొనసాగాలని నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసే వరకు ఇదే జోష్ ఉండాలన్నారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన పార్లమెంటరీ యుద్ధ భేరీ సదస్సు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడరని స్పష్టంచేశారు. కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఆత్మగౌరవంతో బతుకుతున్నామని చెప్పారు. పదేండ్ల నిజమైన పాలనకు.. వంద రోజుల అబద్దాల పాలనకు యుద్ధం ఇది అని తెలిపారు. 100 రోజుల్లో 200 మంది రైతులు మరణిస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి ఓటేయ్యాలని కోరారు. కరీంనగర్‌కు ఎంపీగా బండి సంజయ్ ఏం చేశాడో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
బీఆర్ఎస్ పాలనలోనే కరీంనగర్లో నిజమైన అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో బండి సంజయ్‌ను ఎంపీగా గెలిపిస్తే.. కరీంనగర్‌కు పైసా తీసుకురాలేదని విమర్శించారు. వినోద్ కుమార్ మళ్లీ గెలిస్తే కరీంనగర్ నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తారని చెప్పారు. ప్రశ్నించే గొంతు పార్లమెంటుకు వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.