భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినమైన ఆదివారం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత పవిత్ర గోదావరీ జలాలను తీర్థబిందెతో తెచ్చి నిత్యకల్యాణ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సమయంలో స్వామి వారికి పంచామృతాభిషేకం, విశేష అర్చన, ఉగాది ప్రసాద నివేదన చేశారు. మూలవరులకు అభిషేకం, నిత్యకల్యాణ మండపంలో స్వామి వారికి ఉత్సవాంగ స్నపనం గావించారు. దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం శ్రీ సీతారామచంద్రమూర్తులను స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం (తాతగుడి)లోకి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా మత్స్యం గ్రహణం నిర్వహించారు. అనంతరం మట్టిని సేకరించి కల్యాణ అంకురార్పణకు వినియోగించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు.
– భద్రాచలం