యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఉదయం బాలాలయంలో చివరిసారిగా స్వామి వారికి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు.
స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి గజ వాహన సేవ పై స్వామి వారిని, ప్రత్యేక సేవపై అమ్మవార్లను ఊరేగించి కల్యాణ మండపంలో అధిష్టింపజేశారు.

అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ తంతు నిర్వహించి అభిజిత్ లగ్న సుముహూర్తంలో కల్యాణం నిర్వహించారు. తిరు కల్యాణ మహోత్సవంలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి నరసింగరావు, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, ఈఎన్సీ రవీందర్ రావు, గణపతి రెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో భూపాల్ రెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

