హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : చేయని నేరాన్ని ఒప్పుకోవాలని షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ చేయకుండా, మహిళా కానిస్టేబుల్ లేకుండా, కన్న కొడుకు ముందే సునీతను చిత్రహింసలకు గురి చేయడం పోలీసుల అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ ప్రకటనలో పోలీసుల దౌర్జన్యకాండపై మండిపడ్డ ఆయన.. పోలీసుల అధికార దుర్వినియోగం, మానవ హకుల ఉల్లంఘనను ఖండించారు. ప్రభుత్వం మానవ హకులను కాపాడటంలో విఫలమైందని, పోలీసుల అధికార దుర్వినియోగమే నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఘటనపై దర్యాప్తుచేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై సీఎంవో, డీజీపీ వెంటనే స్పందించాలని ఎక్స్ వేదికగా విన్నవించారు.