యాదగిరిగుట్ట, జూలై 5: యాదగిరిగుట్టలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఖాళీ ప్రదేశంలో కాంగ్రెస్ నేతల కబ్జాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మోకాళ్లు, చేతులతోపాటు శరీరంపై ఎక్కడి పడితే అక్కడ కొట్టారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచి కండ్లల్లో కారం చల్లి మరీ కొట్టినట్టు బాధితులు వాపోయారు. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన తాళ్ల రాజేశ్వర్‌రెడ్డి, ఆకుల రాజశేఖర్, సాయితోపాటు మరికొందరు క్రాంతి యూత్‌ను స్థాపించి 2001 నుంచి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా కొండపైకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన 2003లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం పక్కన ఖాళీ ప్రదేశంలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతోపాటు తెలంగాణ అమరులకు నివాళి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ విగ్రహం దగ్గర ఖాళీ స్థలంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అనుచరులు, పట్టణానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు శాశ్వతంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలను బీఆర్ఎస్ కార్యకర్తలు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. విగ్రహం కనిపించకుండా నిర్మాణాలు చేపట్టొద్దని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు విగ్రహం పక్కన కొబ్బరిబొండాలను విక్రయించే మహిళ లక్ష్మితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆకుల రాజశేఖర్, సాయిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. విషయం తెలుసుకునేందుకు స్టేషన్‌కు వెళ్లిన వారి స్నేహితుడు తాళ్ల రాజేశ్వర్‌రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా.. అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు స్టేషన్లోనే ఉంచి ముగ్గురిపై కారంపొడి చల్లి మరీ థర్డ్ డిగ్రీని ప్రయోగించారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య స్టేషన్‌కు వెళ్లి థర్డ్ డిగ్రీపై సీఐ రమేశ్‌ను ప్రశ్నించగా.. థర్డ్ డిగ్రీని ప్రయోగించలేదని, గాయాలు ఎలా అయ్యాయో తెలియదని బుకాయించారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కరె్రఎ వెంకటయ్య ఆధ్వర్యంలో శుక్రవారం యాదగిరిగుట్ట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశారు. థర్డ్ డిగ్రీని అమలు చేసిన సీఐ రమేశ్, ఎస్సై జ్ఞానేశ్వర్రెడ్డిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని
డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీసీపీ రాజేశ్‌చంద్రకు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనపై సీఐ రమేశ్‌ను వివరణ కోరగా.. తాము ఎవరినీ కొట్టలేదని, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉన్న గాయాలకు, పోలీసులకు సంబంధం లేదని తెలిపారు. చిరువ్యాపారి లక్ష్మి తన దుకాణంపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేయడంతోనే అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
షెడ్ల నిర్మాణాలను అడ్డుకున్నామన్న అక్కసుతోనే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అనుచరులు పోలీసులతో మమ్మల్ని కొట్టించారు. మేం ఎంత బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. కండ్లల్లో కారంపొడి చల్లి మరీ కొట్టారు. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి అమాయకులను శిక్షించడం దుర్మార్గం.
-ఆకుల రాజశేఖర్, బాధితుడు
మా స్నేహితులను పోలీసులు స్టేషన్‌కు పిలిచారని తెలిసి నేను అక్కడికి వెళ్లాను. మావాళ్లను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తే.. ఎస్సై జ్ఞానేశ్వర్‌రెడ్డి నాపై కూడా దాడికి దిగారు. విచక్షణ లేకుండా కొట్టారు. నాఫై ఫిర్యాదు లేకున్నా చావబాదారు.
-తాళ్ల రాజేశ్వర్‌రెడ్డి, బాధితుడు