నిజాంపేట,సెప్టెంబర్17 : నగలు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ..నమ్మించి దంపతుల నుంచి పట్టపగలే 3 తులాల బంగారు గొలుసును(Gold chain) దుండగులు(Thieves) చోరీ చేసిన సంఘటన మెదక్( Medak)జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ గ్రామానికి చెందిన దంపతులు బలిజ లక్ష్మి, మల్లేశం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో నందిగామ గ్రామ శివారు రాయిలాపూర్ గేట్ వద్దకు రాగానే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అడ్డం వచ్చి అమ్మా..దొంగలు ఉంటారు జాగ్రత్త.
బంగారు నగలు మెడలో ఉంటే ఎత్తుకెళ్తారని లక్ష్మిని నమ్మించి, 3 తులాల బంగారు గొలుసును తెల్లటి కాగితంలో చుట్టి ఇస్తానంటూ మాయమాటలు చెప్పారు. ఇదే అదనుగా భావించిన దుండగులు తెల్లటి కాగితంలో బంగారు గొలుసుకు బదులు సమాన బరువు గల రాళ్లను పెట్టి లక్ష్మికి ఇచ్చారు. గమనించని బాధితురాలు రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు వెళ్లి తెల్లటి కాగితంలో రాళ్లను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత దంపతులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ తెలిపారు.