బేదారి, డిసెంబర్ 6: వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐలో దోపిడీ చేసిన ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విలేకరుల సమావేశంలో సీపీ అంబర్కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు. యూపీ షెహవాజ్పూర్కు చెందిన అన్సారీ, బుడాన్కు చెందిన షాఖీర్‌ఖాన్, బుల్దనా జిల్లాకు చెందిన హిమాన్షు , బదౌన్ జిల్లాకు చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, బడాయు జిల్లాకు చెందిన సాజిద్‌ఖాన్, మహారాష్ట్ర చికిల్లి తాలుకా సైగావ్ గ్రామానికి చెందిన అక్షయ్, ముల్దానా జిల్లాకు చెందిన సాగర్ భాస్కర్గోర్ కలిసి బ్యాంకుల దోపిడీ ముఠాగా ఏర్పడ్డారు. హైదరాబాద్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని గూగుల్ ద్వారా బ్యాంకుల సమాచారాన్ని సేకరించేవారు. రాయపర్తిలోని ఎస్బీఐ దోపిడీకి ప్లాన్ చేశారు.
నవంబర్ 18న అర్ధరాత్రి రాయపర్తికి చేరుకొని బ్యాంకు లోపలికి చొరబడ్డారు. మూడు లాకర్ల నుంచి రూ. 13కోట్ల 61లక్షల విలువ చేసే బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు బృందాలుగా విడిపోయారు. టెక్నాలజీ సాయంతో యూపీకి చెందిన అర్షాద్, షాఖీర్‌ఖాన్, హిమాన్షును పోలీసులు పట్టుకొని 2.520 కిలోల గోల్డ్, కారు, రూ. పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలోని నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. కేసులో ప్రతిభ చూపిన డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు నర్సయ్య, భోజరాజు, కిరణ్‌కుమార్, టీంలో ఉన్న ఆత్మకూరు, రఘునాథపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్‌ఫోర్స్, పోలీసు కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని సీపీ అభినందించారు.