Thief | భిక్కనూరు, ఏప్రిల్ 3: ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించగా అతడి చేయి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రామేశ్వర్పల్లికి చెందిన సురేశ్ గ్రామంలో ఉన్న మాసుపల్లె పోశమ్మ ఆలయంలో పనిచేస్తున్నాడు.
సురేశ్ సోమవారం రాత్రి ఆలయం ముందు ఉన్న హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు. హుండీలో నుంచి డబ్బులను తీసుకునేందుకు ఎడమ చేయిని లోపలికి పెట్టగా అందులోనే ఇరుక్కుపోయింది. దీంతో రాత్రంతా అలాగే ఉండిపోగా.. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సురేశ్ చేతిని అందులో నుంచి తీయించి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.