పెన్‌పహాడ్, మే 3 : ‘కేసీఆర్ పాలనలో రెండు పంటలు పండించి మంచిగ బతికినం. పేదోళ్లకు మంచి చేయడంలో ఆయనకు మించినోళ్లు లేరు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయినం. నీళ్లందక పంటలు ఎండిపోయి అప్పుల పాలైనం.నోటికాడి బుక్కను పారేసుకున్నం.. మళ్లీ ఆ తప్పు చెయ్యం. ఈ సారి కారే రావాలి. కేసీఆర్ సారే కావాలి’ అని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దూపాడ్కు చెందిన మహిళలు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎదుట వాపోయారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం దూపాడ్కు వచ్చిన జగదీశ్‌రెడ్డితో గ్రామస్థులు, మహిళలు మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పంటలను ఎండబెట్టిందని చెప్పి బాధపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులున్నా వాళ్ల కడుపులు ఎలా నింపుకోవాలనే ఆలోచన తప్ప రైతులకు మంచి చేయాలనే ధ్యాసే లేదని వాపోయారు. ‘మీరు మంత్రిగా ఉన్నప్పుడు కాల్వ గట్ల మీద రేయింబవళ్లు తిరిగి కుంటలు, చెరువులు నింపి మా పొలాలకు నీళ్లిచ్చిన్రు’ అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రైతుబంధు కూడా రాలేదని చెప్పారు.