Congress | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): గుర్రం కండ్లకు గంతలు కట్టడం గురించి తెలుసా.. గుర్రం దృష్టి మొత్తం ముందువైపే ఉంచి, మనకు కావాల్సినట్టుగా పరిగెత్తేలా వేసే ఎత్తుగడ ఇది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అచ్చం అలాంటి ఎత్తుగడే వేశాయి. ఎన్నికల వేళ ముఖ్య నేతలు పక్క చూపులు చూడకుండా వారి కండ్లకు ‘కార్పొరేషన్ పదవులు’ అనే గంతలు కట్టాయి. ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే అన్నది సస్పష్టం. బయటకు వచ్చిన 37 పేర్లన్నీ లీకులు మాత్రమే. ఫలానా వారికి ఫలానా కార్పొరేషన్ పదవి అంటూ గంపగుత్తగా ఒక జాబితాను లీక్ చేసి చేతులు దులుపుకున్నారు.
కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికీ అధికారికంగా చైర్మన్ పదవి ఇవ్వలేదు. కనీసం ఇప్పటివరకు ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. ఎవరూ పదవీ బాధ్యతలు చేపట్టలేదు. కనీసం ఒక్కరికి కూడా ప్రొటోకాల్ లేదు. ‘మాకు పదవి వచ్చిందంట’ అని సంబర పడటానికి, అనుచరులు, బంధుగణంతో చప్పట్లు కొట్టించుకొని, శాలువాలు కప్పించుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్కు గాలివాటంగా అధికారం వచ్చిందనేది మొదటి నుంచీ ఉన్న వాదన. అధికారంలోకి వచ్చినా, 100 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో బలం పెరగలేదు. పార్టీ, ప్రభుత్వం అంతర్గతంగా నిర్వహించిన నియోజకవర్గాల వారీ సర్వేలు, ఫ్లాష్ సర్వేల్లోనూ ఇదే తేలినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ఆ పార్టీకి అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరుకని పరిస్థితి. దీంతో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఇతర నేతలను టికెట్ ఇస్తామని చేర్చుకొంటున్నారు. అభ్యర్థులు దొరుకుతున్నా.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నేతలు ఉత్సాహంగా పనిచేయడం లేదని పార్టీ పెద్దల దృష్టికి వచ్చిందట. అభ్యర్థులను ఇతర పార్టీల నుంచి తెచ్చుకుంటున్నట్టే.. నామినేటెడ్ పదవులు కూడా పక్క పార్టీల వారికి కట్టబెడుతారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో వారిని రాజకీయంగా వాడుకోవాలని ‘కార్పొరేషన్ పదవులు’ అనే ఎరను సిద్ధం చేశారని చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి నెల రోజుల నుంచే కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తారని ప్రచారం ఉంది. కానీ పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత కేవలం ఒక జాబితాను లీక్ చేశారు. అంతేతప్ప.. అధికారికంగా ఎలాంటి జీవోలు విడుదల కాలేదు. ఎన్నికల్లో వారిని వినియోగించుకునేందుకు మాత్రమే ఈ జాబితా బయటికి వచ్చిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేరని చెప్తున్నారు. అప్పటికి ఈ జాబితాలో సగానికిపైగా పేర్లు మారడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన నేతలు సచివాయంలో, ఆయా కార్పొరేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మా చాంబర్ ఎక్కడుంది? ఎంత జీతం ఇస్తారు? కారు, పీఏ వంటివి ఏయే వసతులు ఉంటాయి?’ వంటి వివరాలు ఆరా తీస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. మాకు గన్మెన్లను ఇస్తారా? ఎంత మందిని ఇస్తారు? వంటివి కూడా ఆరా తీశారట. కొందరైతే ఏకంగా తమ చాంబర్లో ఏమేం కావాలో మార్పులు-చేర్పులు కూడా సూచిస్తున్నట్టు తెలిసింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.