హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీడీపీని కాంగ్రెస్‌లో కలిపినట్టుగానే.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌ను బీజేపీలో కలుపుతారని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి కాంగ్రెస్ నారు పోయలేదని, బీజేపీ నీరు పోయలేదని ఎద్దేవాచేశారు. విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు జరిగితే వరి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయబోదని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో చాలామంది రైతులు ఇతర పంటలు సాగుచేస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్షాలు మాత్రం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వరి వేసి ఆ వడ్లతో రైతులు రోడ్లపైకి వస్తే సీఎం కేసీఆర్‌ను బద్నాం చేయాలన్నది రేవంత్‌రెడ్డి ఉద్దేశంగా కనిపిస్తున్నదన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు వారం రోజులపాటు పార్లమెంట్లో ఆందోళన చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి ఒక్కరోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్‌గాంధీ చేత ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ప్రత్యర్థులుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో మాత్రం ప్రేమబాణాలు వేసుకొంటున్నాయని ఎద్దేవాచేశారు. రైతులు ఢిల్లీలో 16 నెలలపాటు పోరాడితే కాంగ్రెస్‌పార్టీ వారికి అండగా నిలువలేదన్నారు. పెట్రో ధరలు పెరుగుతుంటే ఏనాడైనా పోరాడారా? అని నిలదీశారు. దేశంలో వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తంలో సగమైనా ఏ రాష్ట్రమూ ఖర్చు చేయట్లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సైతం తెలంగాణ పెట్టిన ఖర్చులో కనీసం 25 శాతం కూడా పెట్టడంలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కేంద్రంగానే పనిచేస్తుందని స్పష్టంచేశారు.
కేంద్రంలో ఖాళీల మాటేమిటి?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చేతనైతే ఢిల్లీకి పోయి ఉద్యోగాల గురించి మాట్లాడాలని మంత్రి సింగిరెడ్డి సవాల్ విసిరారు. ముందుగా కేంద్రంలో ఖాళీల భర్తీ గురించి మాట్లాడి, ఆ తర్వాత రాష్ట్రం సంగతి మాట్లాడాలన్నారు. 2020 మార్చి 1 వరకు కేంద్రంలో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విషయాన్ని కేంద్రమే పార్లమెంట్లో ప్రకటించిందని చెప్పారు. ఉద్యోగుల జోనల్, జిల్లాలవారీగా విభజన తర్వాత ఖాళీలపై స్పష్టత రాగానే త్వరలో నోటిఫికేషన్లు విడుదల అవుతాయని తెలిపారు. నోటిఫికేషన్లు రాబోతున్నాయని తెలిసే బండి నిరుద్యోగ దీక్ష చేపట్టారని విమర్శించారు. ‘మోదీకి మేం ఎందుకు భయపడుతాం? ఆయన ఏమైనా వంద తలలు ఉన్న రావణాసురుడా?’ అని ప్రశ్నించారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బిడ్డ అని, రేవంత్‌రెడ్డి కమర్షియల్ బిడ్డ అని అన్నారు. రచ్చచేసి రొచ్చు చేయాలనేదే రేవంత్ లక్ష్యమన్నారు. ఎర్రవల్లి వస్తే ప్రజలే ఆయనను ప్రతిఘటిస్తారని చెప్పారు.