హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకో న్యాయం.. ఆర్థిక మంత్రి భార్యకో న్యాయమా..? అని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకున్నట్టు.. మంత్రి భార్యపై వచ్చిన ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని నిలదీశారు. పెన్షన్ బకాయిల విడుదలకు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క భార్య 10% కమీషన్ డిమాండ్ చేశారని.. స్వయంగా ఓ మహిళా రిటైర్డ్ ఉద్యోగి ఆరోపణలు చేస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని శ్రీపాల్‌రెడ్డి కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్టే.. మంత్రుల భార్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఉద్యోగులు, మంత్రులు సమానం కాదా..? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల అమలు, పీఆర్సీ, డీఏల విడుదల, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం పీఆర్టీయూ టీఎస్ మంగళవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇందిరాపార్కులో నిర్వహించిన మహాధర్నాకు పలు ప్రాంతాల నుంచి వేలాదిగా టీచర్లు తరలివచ్చారు. టీచర్లంతా నీలిరంగు దస్తులు ధరించి హాజరుకావడంతో ఇందిరాపార్కు పరిసరాలు నీలిమయంగా మారిపోయాయి. మహాధర్నాలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు పీ వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఏ శశిధర్‌శర్మ, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్, తరాల జగదీశ్, దిలీప్‌రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పీఆర్సీ కమిటీని రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామన్నారు. ఆరు నెలల్లోపే నివేదిక తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామన్నారు. కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తున్నారు. అసలు మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా..? లేదా..? అన్నది తెలియని పరిస్థితులు ఉన్నాయి..’ అని శ్రీపాల్‌రెడ్డి మండిపడ్డారు. పీఆర్సీ రిపోర్ట్‌ను ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారని సర్కార్‌ను నిలదీశారు. ఆర్థికశాఖలో ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.
సీపీఎస్‌ను రద్దుచేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టలేదా..? అంటూ శ్రీపాల్‌రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చిన తెల్లారే అధికారులు వెళ్లి సుప్రీంకోర్టులో కేసులు వేయడం అత్యంత దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఐఏఎస్‌లకు పాత పింఛన్ వర్తిస్తుంది.. కానీ ఉద్యోగులకు మాత్రం వర్తించదా..? అంటూ ప్రశ్నించారు. దీనిపై కొర్రీలు పెట్టడం అసమంజసమని పేర్కొన్నారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమానికి పిలుపునిస్తే సీఎం చర్చలకు పిలువడం.. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికి ఐదుసార్లు ఇలా జరిగింది..’ అని శ్రీపాల్‌రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు మిగిలింది 825రోజులేనని, వెయ్యి రోజుల పాలనలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఏం చేశారో పునరాలోచించుకోవాలని శ్రీపాల్‌రెడ్డి సూచించారు. ఫస్టాఫ్ ముగిసిందని.. సెకండాఫ్ మాత్రమే మిగిలిందని, మ్యానిఫెస్టో హామీల అమలు ఎప్పుడని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ. కోటి చెల్లిస్తున్నామన్న సీఎం వ్యాఖ్యలపై శ్రీపాల్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రూ. కోటి దేవుడెరుగు.. రూ.13 -16లక్షల గ్రాట్యుటీతప్ప మిగతాదంతా ఉద్యోగులు దాచుకున్నసొమ్ములే అని పేర్కొన్నారు.