నల్లగొండ ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి నల్లగొండ మంత్రులకు మధ్య చెడిందా? వీరి మధ్య వైరం తారస్థాయికి చేరిందా? ఇక తాడోపేడో అన్న పరిస్థితులు నెలకొంటున్నాయా? అన్న అనుమానాలకు రాష్ట్ర సర్కార్‌లో జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను మార్చడం వీరిమధ్య మరింత అగాథాన్ని మరింత పెంచినట్టు తెలుస్తున్నది. కనీస సమాచారం ఇవ్వకుండా సీనియర్ మంత్రులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖను ఇన్చార్జి మంత్రుల బాధ్యతల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి తప్పించారు. ఇందులో నల్లగొండకు చెందిన ఇద్దరు మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు, సమయం కోసం వేచిచూస్తూ తామేంటో స్పష్టం చేయాలన్న పంతంతో రగిలిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
శాఖలు వదులుకోలేదనే కోతలు
ఆరంభం నుంచే రేవంత్‌రెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య సత్సంబంధాలు లేవన్నది అందరికీ తెలిసిందే. అధికారిక కార్యక్రమాల్లో పైకి ఐక్యంగా కనిపించినా..లోలోపల మాత్రం ఎవరివారే అన్న తీరు కొనసాగుతున్నది. తన మంత్రిత్వ శాఖల్లో సీఎం సహా ఎవరూ జోక్యం చేసుకోకుండా మంత్రి ఉత్తమ్ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అలాగే తనకు సంబంధం లేని సీఎం, డిప్యూటీ సీఎం శాఖల్లోనూ ఆయన జోక్యం చేసుకోవడానికి విముఖత చూపుతుంటారు. ఇక పార్టీ వ్యవహారాల్లో సైతం ఉత్తమ్ అధిష్ఠానం కనుసన్నుల్లో పనిచేస్తూ వస్తున్నారు. రాష్ర్టానికి సంబంధించి అధిష్ఠానం సైతం ఉత్తమ్‌ను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోదన్నది కాంగ్రెస్ వర్గాలే చెప్తుంటాయి. ఇలాంటి కీలక నేత, ఏదైనా అనుకోని సందర్భం వస్తే సీఎం అయ్యే అర్హతలు ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కరీంనగర్ ఇన్చార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు.
ఇక నల్లగొండ జిల్లాకే చెందిన మరో మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అందరికంటే సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరంభంలో రేవంత్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలో ఏకంగా రూ. 50లక్షలు పెట్టి అధ్యక్ష పదవిని కొన్నాడని బహిరంగంగానే విమర్శలు చేసిన వ్యక్తి ఆయన. ఎన్నికల ముందు వరకు రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్‌రెడ్డికి జీహూజూర్ అన్నట్టుగా మారిపోయారు. రేవంత్‌రెడ్డిపై ఈగ వాలనివ్వనంతగా ఓ దశలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటనలు వెలువడ్డాయి. కోమటిరెడ్డి బలాలుబలహీనతలు తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ, ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టుగా ఆయనను పావుగా వాడుకుని వదిలేసాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి మంత్రుల మార్పులు చేర్పుల్లో కోమటిరెడ్డిని కూడా పక్కన పెట్టేశారు.
కనీసం సమాచారం లేక…
ఈ నెల 12న ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి మార్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఉన్న కరీంనగర్ ఇన్చార్జి బాధ్యతలను తుమ్మల నాగేశ్వర్రావుకు, వెంకట్‌రెడ్డికి ఉన్న ఖమ్మం బాధ్యతలను కొత్త మంత్రి వాకిటి శ్రీహారి అప్పగించారు. ఈ మార్పుల విషయాన్ని సీఎం రేవంత్.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, వెంకట్‌రెడ్డికి కనీసం సమాచారం లేదు. వాస్తవంగా వీరితోపాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తారని, కొత్త మంత్రులకు వీళ్ల నుంచి పలు శాఖలను తొలగించి అప్పగిస్తారన్న చర్చ జరిగింది. ఉత్తమ్ నుంచి సివిల్ సైప్లె, కోమటిరెడ్డి నుంచి సినిమాటోగ్రఫీ శాఖలను తొలగించాలన్నది రేవంత్‌రెడ్డి అభిప్రాయంగా తెలిసింది. కానీ వీరు ఒప్పుకోకపోవడంతో విధిలేక కొత్త మంత్రులకు సీఎం తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించాల్సి వచ్చింది.
శాఖల మార్పులపై తన మాటను లెక్కచేయలేదన్న అక్కసుతో రేవంత్‌రెడ్డి వీరిద్దరిపై పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా వారి జిల్లాల ఇన్చార్జి బాధ్యతలను తొలగించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్చార్జి మంత్రుల బాధ్యతల నుంచి తొలగించడంపై వీరిద్దరూ లోలోపల తీవ్రంగా రగిలిపోతున్నారని వారి అనుచరులు చెప్తున్నారు. తమ సన్నిహితుల వద్ద సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీనియర్లమైన తమనే తీవ్రంగా అవమానపరిచే రితీలో రేవంత్‌రెడ్డి వ్యవహారించడాన్ని వీరిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. పైగా వీరికి పనిభారం తగ్గించేందుకే ఇన్చార్జి మంత్రుల బాధ్యతల నుంచి తప్పించినట్టు సీఎం కోటరీ ప్రచారం చేయడం కూడా వీరికి అస్సలు మింగుడుపడడం లేదు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు కోసం తమతో పాటు మరికొందరు సీనియర్ల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అవమానకరరీతిలో వ్యవహారిస్తున్నట్టు వీరు భావిస్తున్నారని సమాచారం.
ఇతర నేతలు సైతం…
సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత కొంతకాలంగా సయోధ్యతో కనిపిస్తున్నారు. వీరికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా తోడయ్యారు. తనకు మంత్రి పదవికి రాకుండా ఉత్తమ్ అడ్డుపడుతున్నట్టు తొలుత భావించిన రాజగోపాల్‌రెడ్డి తాజా పరిణామాలతో రేవంత్‌రెడ్డినే కారణమన్న అంచనాకు వచ్చారని తెలిసింది. ఇక లంబాడీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వలేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో లంబాడీ సామాజికవర్గానికి చెందిన సత్యవతి రాథోడ్‌ను ఎలాంటి పదవి లేకున్నా కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వీరంతా కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సిద్ధవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఏ విషయాలనైనా తమతో సంబంధం లేకుండా సీనియర్ నేత జానారెడ్డితో సంప్రదించడాన్ని సైతం వీరంతా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు సీనియర్ మంత్రులు, ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్న నల్లగొండ జిల్లాకు మొదటిసారి కొత్తగా మంత్రివర్గంలో చేరిన అడ్లూరి లక్ష్మణ్‌కు ఇన్చార్జి మంత్రి బాధ్యతలను అప్పగించడంపై కూడా వీరు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వీటన్నింటికీ కారణమైన సీఎం రేవంత్‌రెడ్డికి భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు తమ సత్తా చూపాలన్న కసితో వారు రగిలిపోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర సర్కార్‌లో ఏదైనా అనుకోని పరిణామాలు సంభవిస్తే నల్లగొండ జిల్లా నుంచే మొదలవుతాయన్న హెచ్చరికలు సైతం చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుత పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.