హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : పత్తి మద్దతు ధరలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పండే పత్తి మేలైన రకమని సీసీఐ చైర్మన్ గతంలో చెప్పారని, కానీ గుజరాత్ పత్తికి తెలంగాణ పత్తి కంటే అధికంగా మద్దతు ధర ప్రకటించారని ఆయన విమర్శించారు. గుజరాత్లో పత్తికి మద్దతు క్వింటాకు రూ.8257 ఉంటే తెలంగాణ రైతుకు రూ.7521 మాత్రమే ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి ధర పడిపోయినా ప్రభుత్వం స్పందించడంలేదని, సీసీఐ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్లో క్వింటాలు పత్తికి ఇస్తున్న మద్దతు ధర తెలంగాణ రైతులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీనిపై రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు స్పందించాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 2.5కోట్ల మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు జాడలేదని, క్వింటాలుకు రూ.500 వడ్ల బోనస్ ఊసులేదని విమర్శించారు. పేదల ఇండ్లు కూల్చడమే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఒంటికాలితోలేచిన మేధావులు ఇప్పుడెందుకు నోరుమూసుకున్నారని నిలదీశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ రజనీసాయిచంద్, బీఆర్ఎస్ నేత కురువ విజయ్ పాల్గొన్నారు.