మక్తల్ టౌన్, డిసెంబర్ 13: రైతును మించిన విజ్ఞానవంతుడు లేడని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇతర పంటల సాగుపై నియోజకవర్గంలోని మూడు వేల మంది రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలకు మించిన ఆలోచన రైతులదని అన్నారు. తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నదని, 80 లక్షల మందికి రైతుబంధు సాయం అందిస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆకలి కేకల నుంచి ఆహార నిల్వల స్థాయికి ఎదిగామన్నారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని చెప్పారు.
తెలంగాణ పత్తికి డిమాండ్
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ల కన్నా రాష్ట్రంలోనే పత్తిని అత్యధికంగా పండించారని, తెలంగాణ పత్తికి దేశంలో మంచి డిమాండ్ ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. యాసంగిలో వరికి బదులు మినుములు, పొద్దుతిరుగుడు, శెనగ, వేరుశెనగ వంటి పంటల సాగు చేపట్టాలని సూచించారు.మిల్లర్లు ధాన్యం కొంటామని హామీ ఇస్తే వరి వేసుకోవచ్చని చెప్పారు. ఖమ్మం, కొత్తగూడెంలో 50 నుంచి 60 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతున్నదని, రైతులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి పంటపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అరటి, చెరుకు పంటలను కూడా సాగు చేయొచ్చని పేర్కొన్నారు. పొలం గట్లపై శ్రీగంధం చెట్లు పెట్టుకోవచ్చని చెప్పారు. ధాన్యం కొనడం, సరఫరా చేయడం ఎఫ్‌సీఐ బాధ్యత అని అన్నారు. దేశాన్ని నడిపే కేంద్ర ప్రభుత్వానికి గోదాంలు నిర్మించాలన్న ఆలోచన లేదా అని ప్రశ్నించారు. కొందరు బాధ్యత లేకుండా రాజకీయాలు చేస్తూ.. రైతుల జీవితాలను ఆగం పట్టిస్తున్నారని మండిపడ్డారు.