హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య(యూజీ-ఎంబీబీఎస్, బీడీఎస్), (పీజీ-ఎండీ/ఎంఎస్, ఎండీఎస్), సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో మెటర్నిటీ లీవ్‌పై వెళ్లే విద్యార్థులు రీ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కాళోజీ హెల్త్ వర్సిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలను ఆదేశించింది. గతంలో మెటర్నిటీ లీవ్ తీసుకున్న వారికి యూనివర్సిటీ పర్మిషన్ ప్రక్రియకు 15-20 రోజుల సమయం పట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మెటర్నిటీ లీవ్ ముగియగానే విద్యార్థులను కాలేజీల్లో అడ్మిట్ చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
ఇంటర్ పరీక్షల్లో ‘ఎఫ్ఆర్ఎస్’ విధానం
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని అమలుచేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షల నుంచే ఎఫ్ఆర్ఎస్ అమలు చేయనున్నది. ఈ హాజరును ప్రస్తుతానికి పరీక్షల సిబ్బందికి మాత్రమే పరిమితం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లకు ఈ ఎఫ్ఆర్ఎస్ హాజరు వినియోగించనున్నారు. ఇక వాచ్‌లపై నిషేధం విధించనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేస్తున్నారు.