హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్ఆర్బీసీ) మూసివేయడానికి ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఉద్యోగులను రెచ్చగెట్టేందుకే కొందరు కార్మిక సంఘాల నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని, అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. యూనియన్ల పేరుతో కొందరు చేస్తున్న అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎస్ఆర్బీఎస్ను సంస్థ రద్దు చేస్తున్నదంటూ ఉద్యోగులను తప్పుదారి పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం మండిపడింది. 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్మెంట్తో 2024 మే నెలలో అందించామని, పెండింగ్‌లో ఉన్న 11 డీఏలను 2019 నుంచి దశలవారీగా ఉద్యోగులకు విడుదల చేశామని, ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించి రూ.280 కోట్లను ఖాతాల్లో సంస్థ జమచేసిందని, అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి రూ.1.20 కోట్ల ప్రమాద బీమా అందిస్తున్నదని తెలిపింది.
పీఎఫ్, సీసీఎస్ బకాయిలు చెల్లిస్తున్నాం..
మూడున్నరేండ్లలో పీఎఫ్‌కు రూ.2,348. 35 కోట్లను, సీసీఎస్‌కు రూ.1300.73 కోట్ల ను యాజమాన్యం చెల్లించిందని, 2021-22 నాటికి పీఎఫ్ బకాయిలు రూ.1,352.82 కోట్లు ఉండగా.. వాటితోపాటు రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ.. ప్రస్తుతం రూ.580.37 కోట్లకు తగ్గించిందని గుర్తుచేసింది. అలాగే, సీసీఎస్ బకాయిలు 2021-22 నాటికి రూ.887.48 కోట్లు ఉండగా.. రూ.451.09 కోట్లకు సంస్థ తగ్గించిందని తెలిపింది. మూడేండ్లలో మూడు వేలకు పైగా కొత్త బస్సులను సంస్థ సమకూర్చుకున్నదని, ప్రస్తుతం 50 శాతానికి పైగా కొత్త బస్సులు నడుస్తున్నాయని యాజమాన్యం తెలిపింది.
ఎలక్ట్రిక్ బస్సులతో ఉద్యోగాలు పోవు
ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే డిపోల ప్రైవేటీకరణ అంటూ లేనిపోని అపోహలను ఉద్యోగుల్లో సృష్టిస్తున్నారని సంస్థ మండిపడింది. ఎలక్ట్రిక్ బస్సులతో ఒక ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. మార్చి నెల వేతనాల్లో కొంత జాప్యం జరిగిందని సంస్థ ఒప్పుకున్నది. రాష్ట్రంలో 15 డిస్పెన్సరీలను విస్తరించిందని తెలిపింది.