హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-శ్రీశైలం కారిడార్ పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగభాగాన్ని భరించేందుకు ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను ఎలా సమకూర్చుకోవాలో తెలియక తర్జన భర్జన పడుతున్నది. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ప్రాజెక్టుల జాబితాలో దీన్ని చేర్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఉండటం వల్ల ప్రస్తుతం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. దీంతో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) వద్ద రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు 4 లేన్లతో దాదాపు 147 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్ట్ రహదారి నిర్మాణానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఆ ప్రాజెక్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో 54 కి.మీ మేర 4 లేన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. వన్యప్రాణులకు హాని లేకుండా 32 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించేందుకు రూ.7,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో సగం ఖర్చు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది. బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి మొదలయ్యే ఈ కారిడార్ కృష్ణానది మీదుగా శ్రీశైలం డ్యామ్ సమీపంలోని ఈగలపెంట వరకు సాగుతుంది. అక్కడి నుంచి జాతీయ రహదారి 765లో విలీనమవుతుంది. రిజర్వు ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. ముఖ్యంగా వారాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ను ఆపాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ ఇంకా ఎన్హెచ్ఏఐ పనుల ప్రణాళికలో స్థానం లభించలేదు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ప్రాజెక్టుల్లో దీనికి చోటు కల్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దీంతో హైదరాబాద్-శ్రీశైలం కారిడార్ ఎప్పటికి పూర్తవుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎనిమిదేండ్ల క్రితమే మంజూరైన ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకే ఇంకా దిక్కులేదు. ట్రిపుల్ఆర్కు టెండర్లు పిలిచి, పనులు చేపడతామని కేంద్రం చెప్తున్నప్పటికీ అందుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పూర్తిచేయలేదు. హైదరాబాద్-శ్రీశైలం కారిడార్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమైనప్పటికీ సగం ఖర్చును భరించగలిగే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రేవంత్‌రెడ్డి సర్కారు రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా నిర్వహించలేక హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. కానీ, ఈ ప్రాజెక్టుకు రుణ సహాయం అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడంలేదు. కాంగ్రెస్ సర్కారుపై నమ్మకం లేక కాంట్రాక్టర్లు సైతం పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.