హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సంఖ్యాబలం లేని, సభ్యత్వాలు లేని సంఘాలకు చోటు కల్పించడంపై పీఆర్టీయూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఉమ్మడి ఏపీలో ఉన్న జీవో ప్రకారం తెలంగాణ అని మార్చి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సర్కారు తీరును సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు శుక్రవారం ప్రకటనలో తప్పుబట్టారు. నోటిఫికేషన్ జారీచేసి, సభ్యత్వం, సంఖ్యాబలం ఆధారంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చోటు కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు.
సమగ్రశిక్ష జిల్లా కో ఆర్డినేటర్లు, సెక్టోరల్ ఆఫీసర్లుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను నియమించాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ కోరింది. సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి జీ హేమచంద్రుడు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్‌కు వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యాసంస్థల్లో 75% హాజరును తప్పనిసరిగా అమలుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. హైకోర్టు తీర్పు సహా యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు 75% హాజరును ఈ ఏడాది నుంచి కఠినంగా అమలుచేయాలని నిర్ణయించింది. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వైస్చాన్స్లర్ల సమావేశం నిర్వహించారు.