పెద్దమందడి : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) కొనుగోలు కేంద్రాల నిర్వహకులను హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పెద్దమందడి మండలం బలిజపల్లి, వనపర్తి మండలం అంకుర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం గురించి రైతులు అధైర్య పడవద్దని. కొనుగోలు కేంద్రాలలోని చివరిగింజ వరకు కొంటామని అన్నదాతలకు భరోసా కల్పించారు. బలిజపల్లి కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించినా ఎందుకు పాటించడం లేదంటూ నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సరస్వతిని ఆదేశించారు. తేమ శాతం దొడ్డు వడ్లకు 17 శాతం, సన్న వడ్లకు 14 శాతం వచ్చినా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. సిబ్బంది ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే తనకు ఫోన్ చేయాలని సెల్ఫోన్ నెంబర్ను రైతులకు అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి, వనపర్తి మండలాల తహసీల్దార్లు, అధికారులు, రైతులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.