Earthquake | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందంటూ వస్తున్న వార్తలను నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ శశిధర్ కొట్టిపారేశారు. పెద్దపల్లి కేంద్రంగా భూకంపం వస్తుందని, అది హైదరాబాద్‌తో పాటు అమరావతి వరకు ప్రభావం చూపిస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రామగుండం దగ్గర భూకంప సంకేతాలు ఏమీలేవని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రాంతం ఎర్త్ప్లేట్ బౌండరీకి దూరంగా ఉండడంతో భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని, ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా ఎన్జీఆర్ఐ లేదా జాతీయ సంస్థలు అప్రమత్తం చేస్తాయని డాక్టర్ శశిధర్ చెప్పారు.