Civil Supplies | హైదరాబాద్, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యంపై గందరగోళం నెలకొన్నది. గడువు ముగిసినప్పటికీ బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడంతో భవిష్యత్ ప్రణాళికపై అయోమయం ఏర్పడింది. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు మళ్లీ గడువు పొడగిస్తారా లేక టెండర్లు రద్దు చేస్తారా అనే విషయంపై సివిల్ సప్లయిశాఖలో చర్చ జరుగుతున్నది. మొత్తం 38 లక్షల టన్నుల ధాన్యానికి గానూ బిడ్డర్లు 15 లక్షల టన్నులు మాత్రమే ఎత్తారు. ఇంకా 22.99 లక్షల టన్నులు మిల్లుల్లోనూ మూలుగుతున్నాయి. నిర్ణీత సమయంలో బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడంతో సివిల్ సప్లయికి తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పౌరసరఫరాల సంస్థ నిధుల సమీకరణే ప్రధాన ఉద్దేశంతో యాసంగి ధాన్యాన్ని వేలం వేసింది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల్లోనే ఉండడం వల్ల సంస్థపై భారం పడుతుందని, ధాన్యాన్ని విక్రయించి నిధులు రాబట్టుకోవాలని భావించింది. ఇప్పుడు బిడ్డర్లు మొండికేస్తుండడంతో సివిల్ సైప్లె పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. టెండర్లలో విక్రయించిన ధాన్యం విలువ సుమారు రూ.7వేల కోట్ల వరకు ఉంటుంది. బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడంతో ఈ డబ్బులు రాకపోగా ఈ డబ్బులకు బ్యాంకుల్లో వడ్డీ భారం సివిల్ సప్లయిపై పడుతున్నది. ఇప్పటివరకు సుమారు వెయ్యి కోట్ల వడ్డీ భారం పడి ఉంటుందనే అంచనాలున్నాయి.
టెండరు ప్రక్రియలో గడువు ముగిసిన తర్వాత బిడ్డర్లు పని చేయడంలో విఫలమైతే ఆ సంస్థల డిపాజిట్ సొమ్మును జప్తు చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుని, టెండర్లు రద్దు చేస్తారు. కానీ మళ్లీ మళ్లీ గడువు ఇచ్చినా బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడంతో పౌరసరఫరాల సంస్థ చోద్యం చూస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిడ్డర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. బిడ్డర్లకు మళ్లీ గడువు పొడగిస్తారా, లేక చర్యలు తీసుకుంటారా అనే దానిపై మాత్రం స్పష్టతలేదు.