ఇటీవల తనపై ఆరోపణ చేసిన మంత్రితోపాటు తనకు నచ్చని మరికొందరిపై ముఖ్యనేత కత్తిగట్టారా? జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వారిపై వేటువేసేందుకు రంగం సిద్ధంచేశారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఢిల్లీలోని ఓ దక్షిణాది నేత ఆశీస్సులతో, ఢిల్లీ దూత సహకారంతో పలువురు మంత్రులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌లో వెనుకబడటంపై మంత్రుల మీద ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన.. అదే అదనుగా చర్యలకు దిగనున్నట్టు తెలిసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రివర్గం (Cabinet Reshuffle) మెడపై ఖడ్గం వేలాడుతున్నదా? ఏకంగా ఏడుగురు మంత్రుల మీద వేటు పడనున్నదా? దేవత అనుకున్న దూతే ముఖ్యనేతకు కత్తి అందించిందా? ఢిల్లీ ‘దక్షిణ’ గురువు వేసిన ట్రాప్‌లో పడి తనకు తెలియకుండానే కట్టప్పగా మారి ముఖ్యనేతకు మేలు చేసిందా? అంటే ఢిల్లీ కాంగ్రెస్ (Congress) వర్గాలు ‘అవును’ అనే అంటున్నాయి. ప్రతి మంత్రి ఎవరికి వారుగా ఆర్థిక బలోపేతం కోసం అర్రులు చాస్తున్నారని, అదే రాష్ట్రంలో అవినీతి పెరిగేందుకు కారణమైందని ఢిల్లీ దూత అంతర్గత నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దాదాపు చేజారినట్టేనని, ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా మంత్రివర్గ ప్రక్షాళన ఖరారు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పరిపాలన గాడిలో పడలేదని, ముఖ్యనేతకు పాలనపై ఇంకా పట్టు రాలేదని ఏఐసీసీ ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యనేత పాలన తీరుపై ఏఐసీసీ కమిటీలో అందరూ వ్యతిరేకంగానే ఉన్నట్టు తెలిసింది. అయితే అటు ఏఐసీసీకి ఇటు పార్టీ అధిష్ఠానానికి మధ్య సంధాన కర్తగా ఉన్న ఒకే ఒక నేత మాత్రం ముఖ్యనేతను వెనుకేసుకొస్తున్నట్టు తెలిసింది. ముఖ్యనేతకు ‘దక్షిణ’ గురువుగా మారిన ఆయన ఏడాదిన్నరగా కాపాడుకుంటూ వస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏడాది కిందనే తెలంగాణ ముఖ్యనేతను మార్చాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచనకు దక్షిణ గురువు కట్టె అడ్డంపెట్టి ఆపారని అప్పట్లో ప్రచారం జరిగింది.
అప్పట్లో ఢిల్లీ దూతగా హైదరాబాద్‌లో ఉన్న దీపాదాస్ మున్షీ ఉదాసీనతతో ఉండడం వల్లే ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలుస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను నేరుగా వారికి చెప్తున్నారని గుర్తించిన ముఖ్యనేత దక్షిణ గురువు పార్టీ అధిష్ఠానానికి చెప్పి మొదట ఆమెను రాష్ట్రం దాటించినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. పార్టీ వ్యవహారాల పరంగా నిక్కచ్చిగా ఉంటారని, రాహుల్ గాంధీ ఆంతరంగిక బృంధంలోని కీలక సభ్యురాలుగా గుర్తింపు ఉన్న నేతను ఏరికోరి దూతగా హైదరాబాద్‌కు పంపినట్టు తెలిసింది. ఢిల్లీ దక్షిణ గురువు ఆమె వ్యక్తిత్వానికి తగినట్టుగానే సలహాలు, సూచనలు ఇచ్చి హైదరాబాద్ పంపినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
పరిపాలనా వైఫల్యాలను పక్కన పెట్టి ముఖ్యనేత తన క్యాబినెట్‌లోని మంత్రుల మీద దృష్టిపెట్టినట్టు సమాచారం. తనతో విభేదించే మంత్రులను, భవిష్యత్తులో తన సీటుకు ముప్పుగా మారే అవకాశం ఉందనుకున్న మంత్రులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. అలాంటి మంత్రులపై ముందుగా రాజీ అస్త్రం సంధించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక మీదట మంత్రుల శాఖల్లో తాను వేలు పెట్టనని, ఎవరి శాఖల మీద ఆయా మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సంపాదించుకుంటే తనకు అభ్యంతరం లేదని వారికి నమ్మకంగా చెప్పినట్టు అప్పట్లో గాంధీ భవన్ వర్గాల్లో బహిరంగ చర్చలు నడిచాయి.
‘మీ మీ శాఖలకు సంబంధించిన పనుల కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తే..నేరుగా మీ వద్దకే పంపిస్తా’నని మంత్రులకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ముఖ్యనేతకు ప్రధాన పోటీదారులు అనుకున్న ముగ్గురు మంత్రులు రెచ్చిపోయి ఒకాయన 15 శాతం కమీషన్ దుకాణం తెరిస్తే.. మరో మంత్రి 40 శాతం వాటాలతో బిజినెస్ పెట్టుకున్నట్టు సమాచారం. కీలక పోటీదారుగా ఉన్న ఇంకో మంత్రి తన శాఖలోనే ఉనుకను పిండి రూ.600 కోట్ల తైలం తీసినట్టు ప్రచారం జరిగింది. వీళ్లను చూసిన బీసీ, దళిత, బహుజన మంత్రులు కొందరు ముఖ్యనేత వద్దకు వెళ్లి ‘అన్నా..మాకేమీ లేదా?’ అని అడిగితే ‘మీరు కూడా మీమీ శాఖల్లో ఇబ్బందులు లేకుండా పనులు చక్కబెట్టుకోండి’ అని సలహా ఇచ్చినట్టు తెలిసింది.
ముఖ్యనేత హామీతో రెచ్చిపోయిన మంత్రులు ప్రత్యేక ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని వాటాలు, కమీషన్లు, కసరత్తులు చేసి అందినకాడికి దోచుకోవడం మొదలు పెట్టినట్టు, దాదాపు 18 శాఖల్లో అడ్డూ అదుపు లేకుండా అవినీతి పెరిగిపోయినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యనేత హామీ ఇచ్చినట్టుగానే తన దగ్గరకు పనుల కోసం వచ్చిన వారిని ఆయా శాఖల మంత్రులతో కలిసి మాట్లాడుకోవాలని చెప్పించడం, ఒక్కో సారి నేరుగా తన మనుషులనే మంత్రుల వద్దకు పంపించి తనకేమీ ఉచితంగా చేసి పెట్టవద్దని, మిగిలిన వారి వద్ద ఎంత తీసుకుంటారో అంతకు రెండు పైసలు ఎక్కువే తీసుకొని పని చేసి పెట్టాలని కోరేవారని సమాచారం. అవినీతిలో మంత్రులు ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లాక, ఢిల్లీ దూతకు ఫిర్యాదు చేయించడం మొదలు పెట్టినట్టు కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు.
మరో వైపు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలు తెప్పించి ఒక్కో మంత్రిని టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు రూపొందించి, ఒక కాపీ కాంగ్రెస్ అధిష్ఠానానికి, మరో కాపీ ఢిల్లీ దూతకు అందజేస్తూ కార్యం నడిపించినట్టు తెలిసింది. అదే సమయంలో ఢిల్లీ దక్షిణ గురువు కూడా రాష్ట్ర వ్యవహారాలపై వివరాలు కోరుతూ అవినీతి మీద దృష్టి పెట్టాలని సూచించేవారని సమాచారం. నిజానికి పార్టీ వ్యవహారాల పట్ల కఠినంగానే వ్యహరించే ఢిల్లీ దూత దృష్టి పూర్తిగా వారి ట్రాప్‌లోకి వెళ్లిపోయినట్టు సమాచారం. మంత్రుల మీద మనుసు పెట్టి, వారి అవినీతి మీద నివేదికలు తయారు చేయడంతో బిజీ అయినట్టు తెలిసింది. ఒక్కో మంత్రికి సంబంధించి శాఖాపరంగా, జిల్లా ఇన్చార్జి మంత్రులుగా, రాజకీయ నాయకులుగా వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకొని సమగ్ర నివేదికను తయారు చేసి ఢిల్లీకి పంపారని తెలిసింది.
దూత ఢిల్లీకి పంపిన నివేదికలో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బీసీ మంత్రులు మొదటి ప్రయార్టీలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఇద్దరిలో ఒకరు తరచూ వివాదాలతో నిత్య వార్తల్లో ఉంటారని చెప్తున్నారు. ఇటీవలే సిమెంట్ ఫ్యాక్టరీ వివాదంలో పదవీ గండం తప్పదనుకున్న వారు చివరి నిమిషంలో బయట పడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. వారు ఈసారి తప్పించుకోలేరని చెప్తున్నారు. మరో బీసీ మంత్రి నోటి దురుసు తనంతో గండం వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. తోటి మంత్రినే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన ఆయన, ఒక సందర్భంలో తన సన్నిహితుల వద్ద ముఖ్యనేత మీద కూడా నోరు పారేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటున్నారన్న పేరు సంపాదించిన సదరు మంత్రికి ఉద్వాసన ఉంటుందని ప్రచారంలో ఉన్నది. ఇదే ఉత్తర తెలంగాణకు చెందిన మరో మహిళా మంత్రి మెడ మీద కత్తి వేలాడుతున్నట్టు సమాచారం. ముఖ్యనేతకు అత్యంత సన్నిహితురాలిగా గురింప్తు పొందిన ఆమె.. ఇసుక మాఫియా వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయినట్టు ఆరోపణలున్నాయి. పైగా ఆమెను ఇటీవల రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా పలకరించారని, ఒక సందర్భంలో సదరు మహిళా మంత్రి భుజం మీద చేసి వేసి ఫొటోలకు ఫోజులిచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఈ ఫొటోలు ముఖ్యనేతకు కంటగింపుగా మారినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆయన కండ్లళ్ల పెట్టుకున్నట్టు చర్చించుకుంటున్నారు.
లిక్కర్ వ్యవహారంలో లెక్క తప్పి సీనియర్ ఐఏఎస్‌ను టార్గెట్ చేసిన మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆయన పదవి పోతుందని, ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాకే చెందిన మరో దళిత మంత్రి మీదా అవినీతి ఆరోపణలు అధిష్ఠానికి అందినట్టు తెలిసింది. ఢిల్లీ దూత కూడా ఆయన శాఖలో జరుగుతున్న అవినీతిపై సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఆయనను పదవి నుంచి తొలిగించడం గాని, లేదా శాఖ మార్పిడి గాని తప్పదని అంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే అదే కుటుంబం నుంచి ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్న నేతను తొలగించి సీనియర్ ఎమ్మెల్యేను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రికి ఉద్వాసన తప్పక పోవచ్చని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఏకంగా డిప్యూటీ పదవి కూడా మారవచ్చని సమచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతను కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకొని అతడికే డిప్యూటీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ బై పోల్ తర్వాత విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ కసరత్తులో కొత్తగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.