Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతున్నది. ఆచరణలోకి రాని ఆయన ప్రకటనలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. పొంగులేటి కొన్ని రోజులుగా పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయడం, అవి ఆచరణలోకి రాకపోవడం పరిపాటిగా మారింది. దీంతో అసలు అమలుకు సాధ్యంకాని, ఆచరణలోకి రాని ప్రకటనలు ఆయన ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? అవి ఎందుకు అమలు కావడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన చేసిన ప్రకటనలు అమల్లోకి రాకుండా ఎవరైనా కావాలనే అడ్డుకుంటున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనా మంత్రి స్థాయిలో ఉండి సంచలన ప్రకటనలు చేయడం, తీరా అవి అమల్లోకి రాకపోవడంతో మంత్రి నవ్వులపాలవుతున్నారని అంటున్నారు.
దీపావళి బాంబులు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ చట్టం అన్నీ ఉత్తవే కొన్ని రోజులుగా మంత్రి పొంగులేటి చేస్తున్న ప్రకటలన్నీ ఉత్త ‘పొంగు’లేననే విమర్శలొస్తు న్నాయి. కొరియాలో దీపావళి బాంబుల ప్రకటన, దీపావళి నుంచి ఇందిరమ్మ ఇండ్ల ప్రకటన, కొత్త ఆర్వోఆర్ చట్టం, గ్రామ రెవెన్యూ వ్య వస్థ అమలు ఇలా పలు అంశాలపై ఆయన చే సిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. మూ సీ పునరుజ్జీవనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్లతో కూడిన బృందం దక్షిణ కొరియాలోని సియోల్‌లో చిన్న కాలువ సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి కన్నా ముందే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పే లబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.
మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేయబోతున్నారని, దీన్నే మంత్రి పొలిటికల్ బాంబ్‌గా చెప్పినట్టు ప్రచారం జరిగింది. తీరా దీపావళి ముగిసినా మంత్రి పొలిటికల్ బాంబు తుస్సుమన్నది. ఇక ప్రజలకు దీపావళి కానుకగా ఈ నెల 6 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని, తొలి దశలో ఇంటి స్థలం ఉ న్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్థి క సాయం చేయన్తున్నట్టు ప్రకటించారు. ని యోజకవర్గానికి 3,500 నుంచి 4 వేల ఇండ్లను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. మంత్రి చెప్పిన గడువు పూర్తయి వారం రోజులవుతున్నా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కాలే దు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెప్పిన మాటే చెల్లుబాటుకాకపోవడంతో చర్చనీయాంశమైం ది. అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రి హో దాలో ఆయన చేసిన కొత్త ఆర్వోఆర్ చట్టం అ మలు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ అమలు వం టి ప్రకటనలు కూడా అమలుకు నోచుకోలేదు.
మంత్రి ఎందుకిలా?
మంత్రి పొంగులేటి వ్యవహారశైలిపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆయన ఎం దుకు ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్నప్పు డు అమలయ్యే అంశాలకు సంబంధించి మాత్ర మే ప్రకటనలు చేయాలి. కానీ తన హోదా మర చి, పని అవుతుందో లేదో అంచనా వేయకుండానే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మంత్రి ప్రకటనలను అడ్డుకుంటున్నారా?
పొంగులేటి ప్రకటనలపై కాంగ్రెస్‌లోని మరో వర్గం మరో వాదన వినిపిస్తున్నది. మంత్రిగా కీలక స్థానంలో ఉన్న వ్యక్తి ముందువెనక ఆలోచించకుండా ప్రకటనలు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రకటనలు అమలు కాకుండా పార్టీలోని, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తున్నది. దీనిపై పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద దుమారమే రేగుతున్నట్టు తెలిసింది.