జూబ్లీ బస్టాండ్‌లో ప్రస్తుతం 11కేవీ విద్యుత్తు లైన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ స్టేషన్ నడుస్తున్నది. బస్సులు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 33కేవీ విద్యుత్తు లైన్ కోసం టీజీఎస్పీడీసీఎల్కు దరఖాస్తు చేశారు. రూ.10 కోట్లు అవుతుందని అంచనా వేయగా, అధికారులు డిస్కంకు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. దీంతో గన్‌రాక్ నుంచి జేబీఎస్ వరకు 33 కేవీ ఫీడర్ లైన్ వేసేందుకు డిస్కం అధికారులు ఏడాది కిందట కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు.
90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. కేవలం 600 మీటర్ల కేబుల్ వేయాల్సి ఉన్నది. కానీ డిస్కం స్టోర్స్‌లో కేబుల్ లేక నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులను సంప్రదించినా ఫలితం ఉండటం లేదు. ఈ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే కరంటు బిల్లుల రూపంలో డిస్కంకు నెలకు రూ.20 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. కానీ.. కేబుల్ కొనుగోళ్లకు ‘మిస్టర్ 10%’ అనుమతి ఇవ్వడం లేదని ఎస్పీడీసీఎల్ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే..
(రంగనాథ్ మిద్దెల)
TGSPDCL | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్కు ‘మిస్టర్ 10%’ గ్రహణం పట్టిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 33 కేవీ కేబుల్ కొనుగోలుకు ‘పెద్దలు’ అనుమతి ఇవ్వకపోవడంతో పదుల కోట్ల విలువైన పనులు ఆగిపోయాయని చెప్తున్నారు. గతంలో సంస్థ స్టోర్‌లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూలేదని, అవసరమైన మేర సామగ్రి అందుబాటులో ఉండేదన్నారు. కానీ ఏడాది కాలంగా స్టోర్‌లో 33 కేవీ కేబుల్ అందుబాటులో ఉండటం లేదని సమాచారం. కేబుల్ విలువలో పది శాతం ఆయనకు సమర్పిస్తే తప్ప గ్రీన్‌సిగ్నల్ రాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అటు సరఫరాకంపెనీలు, ఇటు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 500 కిలోమీటర్ల మేర 33కేవీ కేబుల్ పనులు ఆరు నెలలుగా ఆగిపోయాయని సమాచారం. ఈ పనులు పూర్తయితే కరంటు చార్జీల రూపంలో సంస్థకు నెలకు రూ.కోట్లలో ఆదాయం వచ్చేదని, ఆ బాస్ మొండిపట్టుతో రాబడికి కూడా గండిపడిందన్న చర్చ జరుగుతున్నది.
కమీషన్ రూ.21 కోట్లు..భారం మోసేది ఎవరు?
ఏడాది కాలంగా స్టోర్‌లో టెండర్ల ద్వారా సమకూర్చుకునే ప్రతి సామగ్రిపైనా పది శాతం ముట్టజెప్పాలనే అనధికారిక నిబంధన అమలులోకి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక కిలోమీటరు 33 కేబుల్ విలువ రూ.41.52 లక్షలుగా ఉన్నది. అంటే పెండింగ్‌లో ఉన్న 500 కిలోమీటర్ల మేర కేబుల్ కొనుగోలుకు రూ.207.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆయన అడుగుతున్న 10 శాతం కమీషన్ విలువ దాదాపు రూ.21 కోట్లు అన్నమాట. దీనిని ఎవరు భరించాలన్నదే ఇప్పుడు తలనొప్పిగా మారిందట. కేబుల్ కొనుగోలు కోసం అధికారులు టెండర్లు పిలిస్తే ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్) ప్రకారం మొత్తం విలువను కోట్ చేస్తారు. ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ ప్రకారం 33 కేవీ కేబుల్ మీటరు ధర రూ.4,152. ఈ ధర ప్రకారమే కేబుల్ తయారీ కంపెనీలు సరఫరా చేస్తాయి. అదనంగా పది శాతం పెంచాలంటే ఎస్‌ఎస్‌ఆర్‌ను సవరించాలి. ఇది ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కమిటీ భేటీ అయ్యి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనధికారిక పది శాతాన్ని సర్దుబాటు చేయలేమని కంపెనీలు కరాఖండిగా చెప్పేసినట్టు సమాచారం.
చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
టెండర్లలో నిబంధనల ప్రకారం కేబుల్‌ను డిస్కం సరఫరా చేస్తుంది. కాంట్రాక్టర్లు సివిల్, ఇతరత్రా పనులు చేయాల్సి ఉంటుంది. అయితే.. 33 కేవీ కేబుల్ కొనుగోలుకు ‘మిస్టర్ 10%’ అనుమతి ఇచ్చే అవకాశం లేకపోవడంతో, కేబుల్ తెచ్చుకోవాలని కాంట్రాక్టర్లకు అధికారులు సూచిస్తున్నారట. అయితే ఈ ప్రతిపాదనను కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. సాధారణంగా డిస్కంలు వందల కిలోమీటర్ల కేబుల్‌ను ఒక్కసారే కొనుగోలు చేస్తాయి కాబట్టి కంపెనీలు రూ.4,152 ప్రకారం ఇస్తున్నాయి. దీని ఆధారంగానే పనుల అంచనా వ్యయాన్ని లెక్కించి, అధికారులు టెండర్లు అప్పగించారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు వ్యక్తిగతంగా 10, 20 కిలోమీటర్ల కేబుల్ కొనుగోలు చేయాలంటే తయారీ కంపెనీలు ధరను పెంచుతాయి. ఆ భారం తాము మోయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారట. నిబంధనల ప్రకారం డిస్కం కేబుల్ ఇవ్వాలని, ఇప్పుడు తమపై ఆర్థిక భారం మోపితే ఎలా? అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. లేదంటే ‘అదనం’గా అయ్యే ఖర్చు ఇస్తేనే పనులు చేస్తామని తెగేసి చెప్తున్నట్టు తెలిసింది. దీంతో ఏ కారణంతో టెండర్ విలువ సవరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారట.
గతంలో ఎప్పుడూ లేదు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిస్కం స్టోర్‌లో అన్ని రకాల సామగ్రి నిత్యం అందుబాటులో ఉండేదని, ఎప్పటికప్పుడు టెండర్లు పిలిచి స్టాక్ ఉండేలా చూసుకునేవారమని అధికారులు చెప్తున్నారు. స్టోర్స్ వ్యవహారంలో ‘పెద్దలు’ ఎవరూ జోక్యం చేసుకునేవారు కాదన్నారు. కానీ ఇప్పుడు.. ‘మిస్టర్ 10%’ ప్రతి దానికి అడ్డం పడుతున్నారని చెప్తున్నారు. ఆయనకు, మెటీరియల్ కొనుగోలు చేసే విభాగం అధికారికి దగ్గరి సంబంధాలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇతర ఉన్నతాధికారులెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. మరోవైపు వర్షాకాలం వచ్చేసిందని, రోడ్లు తవ్వేందుకు జీహెచ్ఎంసీ అనుమతులు నిలిపివేసిందని అధికారులు చెప్తున్నారు. దీంతో పెండింగ్ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. అక్టోబర్‌లో తిరిగి రోడ్డు తవ్వకాలకు అనుమతులు వస్తాయని, అంటే మరో నాలుగైదు నెలలు పనులు ఆగిపోక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఒక్క వ్యక్తి వల్ల అటు రూ.పదుల కోట్ల అత్యవసర పనులు ఆగిపోయాయని, ఇటు డిస్కంకు రూ.కోట్ల రాబడికి గండిపడిందని చెప్తున్నారు.
నిలిచిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు
సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద హైదరాబాద్ నగరంలో 16 అత్యవసర పనులకు అధికారులు ఆరు నెలల కిందట టెండర్లు పిలిచారు. ఇందులో వంద కిలోమీటర్ల మేర 33 కేవీ కేబుల్ వేయాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో టెండర్లు తెరిచి కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. మార్చిలో ఒప్పందం పూర్తయింది. కానీ కేబుల్ లేకపోవడంతో వేసవిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు పూర్తి కాలేదు. వాస్తవానికి ఇవన్నీ ఫీడర్లపై భారాన్ని తగ్గించేందుకు చేపట్టిన అత్యవసర పనులే. పూర్తి కాకపోవడంతో ఫీడర్లపై భారం పెరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో తీవ్ర అవాంతరాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా రెండు విద్యుత్ ఫీడర్లు వేయాల్సి ఉన్నది. 18 కిలోమీటర్ల మేర 33 కేవీ కేబుల్ వేసేందుకు రైల్వే అధికారులు ఎస్పీడీసీఎల్కు రూ.36 కోట్లు డిపాజిట్ చేశారు. డిస్కం అధికారులు కొన్ని నెలల కిందటే టెండర్లు పూర్తి చేసి, కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపారు. పనులు పూర్తయితే రైల్వే స్టేషన్ నుంచి డిస్కంకు నెలకు రూ.కోటి వరకు కరెంటు బిల్లుల రూపంలో ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ.. స్టోర్‌లో కేబుల్ లేకపోవడం, కొనుగోలుకు ‘మిస్టర్ 10%’ అనుమతించే అవకాశం లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆ దస్ర్తాన్ని పక్కన పెట్టారట.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను 33కేవీకి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్నది. ఈ పనులకు రూ.1.92 కోట్లు ఖర్చవుతుందని డిస్కం అధికారులు అంచనా వేయగా, ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. విద్యుత్ అధికారులు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. ఈ పని పూర్తయితే నెలకు రూ.15 లక్షల కరెంటు బిల్లు అదనంగా డిస్కంకు వస్తుందని భావించారు. కానీ.. ‘మిస్టర్ 10%’ కారణంగా స్టోర్‌లో 33 కేవీ కేబుల్ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఈ పనులను కూడా మొదలుపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు.