సిద్దిపేట, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఉన్నా నీళ్లు లేక వెలవెలబోయాయి. బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు రిజర్వాయర్లను నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ల నుంచి నీళ్లందక చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతో పాటు పక్క జిల్లాలోని బచ్చన్నపేట రైతులు ఆందోళన చెందుతున్నారు. తపాస్పల్లి రిజర్వాయర్లో చుక్కనీరు లేక బోసిపోయింది.
బీఆర్ఎస్ హయాంలో ఏటా పంపింగ్ చేసి చెరువులు, కుంటలు నింపి పంటలకు సాగు నీరు అందించారు. రంగనాయకసాగర్ నుంచి కొన్ని గ్రామాలకు సాగునీరు అందించేవారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండిన చెరువులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదని, ఫలితంగా పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నామని రైతులు చెప్తున్నారు. మరికొందరు బావుల్లో పూడిక తీయిస్తుండగా, ఇంకొందరు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. ఏం చేయలేని రైతులు ఎండిన పంట పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు.
నేను ఈ యాసంగిలో రెండెకరాల్లో మక్క వేసిన. పంట పూర్తిగా ఎండిపోయింది. నీళ్లు లేవనే వరి వేయలేదు. నిరుడు, ముందటేడు కూడా మక్క పంటనే వేసిన. అప్పుడు పంట మంచిగా పండింది. ఈ ఏడే గీ పరిస్థితి దాపురించింది. ఇంతముందెప్పుడు గిట్ల కరువు రాలే. అప్పుడు కేసీఆర్ సార్.. చెరువు, కుంటలను నింపిండు. రైతులను మంచిగ చూసుకునేది. ఇప్పుడు రైతులను ఎవలు పట్టించుకోవడం లేదు.