హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రీమియం మొత్తాన్ని హేతుబద్ధీకరించి, మరిన్ని బీమా కంపెనీలకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. 2023-24 పంట సంవత్సరానికల్లా దీనిని అమలుచేసే అవకాశం ఉన్నది.
పంట నష్టాల నుంచి రైతులకు రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో 2016లో ప్రారంభించిన ఈ పథకం వల్ల రైతులకు బదులుగా ఇన్సూరెన్స్ కంపెనీలే లాభపడుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. రైతులు చెల్లించే ప్రీమియం ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు గరిష్ఠంగా 5 శాతం ఉండేవిధంగా నిబంధనలు రూపొందించారు. వాస్తవ ప్రీమియం రేట్లకు రైతు చెల్లించే వాటికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉంటుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ పథకంలో పాల్గొంటున్న బీమా కంపెనీల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. పోటీతత్వాన్ని దెబ్బతీయడంతోపాటు ప్రీమియం రేటు పెరుగుదలకు ఇది దారితీస్తున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. 2019-20 నుంచి 2022-23 సంవత్సరాలకు 18 బీమా కంపెనీలను ఎంప్యానల్ చేయగా.. అందులో 8 మాత్రమే మిగిలాయి. అందులో నాలుగు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌రంగ కంపెనీలున్నాయి.
పోటీతత్వం లేకపోవడంతో ఈ కంపెనీలు ప్రీమియం మొత్తాన్ని భారీగా నిర్ణయించాయి. పైగా గత సంవత్సరం పంట నష్టాలు తకువగా నమోదు కావడంతో ఆయా కంపెనీలు భారీ లాభాలను ఆర్జించినట్టు తేలింది. దీంతో ఈ పథకం బీమా కంపెనీలకు మాత్రమే మేలు చేకూరుస్తున్నదని, రైతులకు కాదన్న అవగాహనకు కేంద్రం వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.